పాలేరులో ష‌ర్మిల ఓడిపోతుందా… సీఎం సీటు కాదు.. అసెంబ్లీ గేటు కూడా దాట‌దా…!

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణలో ఏం ? సాధించబోతోంది. అసలు ఆమె ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారు.. అన్నది ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. అన్న మీద కోపంతో తెలంగాణలో పార్టీ పెట్టారా.. నిజంగానే తెలంగాణ రాష్ట్రంపై ప్రేమతో పెట్టారా అన్నది ఆమెకే తెలియాలి. ఏడాదిన్నర కాలంగా తెలంగాణలో షర్మిల ఏటికీ ఎదురీదుతున్నా సెంటీమీటర్ మైలేజ్ కూడా ఆమెకు రాలేదు అన్నది వాస్తవం. ఎడారిలో ఎంత దూరం వెళ్ళినా గుక్కెడు మంచినీళ్లు దొరకటమే గగనం.. అలా ఉంది ఇప్పుడు తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రస్థానం.

ముఖ్యమంత్రి సీటు అన్నది ఇక క‌ల‌లోనే రావాలి.. అది పక్కన పెడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కనీసం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ గేటు కూడా తాకే పరిస్థితి లేదు అన్నది వాస్తవం. ఎప్పటికే ఆమె ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014 ఎన్నికల్లో షర్మిల అన్న జగన్ పార్టీ ఖమ్మం ఎంపీ సీటుతో పాటు జిల్లాలో మూడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత వారంతా బిఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. అసలు షర్మిలకు రాష్ట్రవ్యాప్తంగా ఆమె పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉండరన్నది వాస్తవం. ఇవన్నీ పక్కన పెడితే పాలేరులో కనీసం ఆమెకు డిపాజిట్లు కూడా వస్తాయా ? అంటే.. చాలామంది త‌లపండిన మేధావులు సైతం నో అని చెప్పేస్తున్నారు.

పాలేరు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ఇక్కడ వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు.. అని కాకి లెక్కలు వేసుకుని షర్మిల పోటీకి దిగుతున్నట్టుగా కనిపిస్తోంది. అదంతా గతం పాలేరులో ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధించింది. గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత బిఆర్ఎస్లోకి జంపు చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించడానికి కందాల ఉపేందర్ రెడ్డి క్లీన్ ఇమేజ్ తో ఎన్నికలలో పోటీ చేయటం.. అటు తుమ్మల నాగేశ్వరరావుపై ఉన్న వ్యతిరేకతతో పాటు ఖమ్మం జిల్లాలో టిడిపి – కాంగ్రెస్ పొత్తు కొంతవరకు సక్సెస్ అవటం.. ఇవన్నీ కారణాలుగా నిలిచాయి.

అయితే ఉపేందర్ రెడ్డి పార్టీ మారాక నియోజకవర్గం లో బీఆర్ఎస్ బలంగా పాతుకు పోయింది.
అసలు ఇప్పుడు పాలేరులో కాంగ్రెస్ అన్న మాటే కరువైంది. ఎవరో ఇద్దరు ముగ్గురు మండల స్థాయి నాయకులు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు తప్ప వాళ్లకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అంత చరిష్మా కూడా లేదు. ఈ నేప‌థ్యంలో షర్మిల పాలేరులో పోటీ చేస్తే ఒక మోస్త‌రు పోటీ ఇచ్చే ఛాన్స్ కూడా లేదని ఇప్పటికే జరిగిన సర్వేలు స్పష్టం చేశాయి. ఇటీవల జరిగిన సర్వేలలో సైతం పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి సానుకూల పవనాలు ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే బిఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని స్పష్టం అయ్యింది.

పాలేరులో కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు ఎప్పుడో చెల్లాచెదురు అయిపోయింది. ఇక రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండడంతో వారి ఓట్లపై ఆశలు పెట్టుకున్నట్టు షర్మిల కనిపిస్తున్న.. తెలంగాణలో ఈ సామాజిక వర్గం ఓటింగ్ ఎప్పుడో బీఆర్ఎస్‌కు ఎక్కువగా మళ్ళింది. రేపు పాలేరు లోను అదే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పాలేరులో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపే క‌మ్మ‌ సామాజిక వర్గం షర్మిలకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఇక బీసీ సామాజిక వర్గాల్లో టిఆర్ఎస్ కు ఏకంగా మూడు వంతులకు పైగా మొగ్గు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాలేరులో షర్మిల పోటీకి ముందే చేతులు ఎత్తేయ‌డం తప్ప చేసేదేం కనపడటం లేదు

Tags: ap politics, election survey, intresting news, latest news, latest viral news, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp