‘మ‌ద్దిపాటి’ గెలుస్తాడా.. ఓడ‌తాడా… గోపాల‌పురం టీడీపీ లెక్కలేంటి…!

చంద్రబాబు తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ వయసులోనూ ఆయన పడుతున్న కష్టం విలువ అమూల్యం. గత సాధారణ ఎన్నికల్లో కేవలం 23 సీట్లకు పడిపోయిన తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి వస్తుందన్న ఆశలు కలిగేలా చేయడంలో.. చంద్రబాబు కృషితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉన్న కసి పార్టీని ప్రేమించే అభిమానులు.. వీళ్ళందరి శ్రమ దాగి ఉంది. ఎవరు ఎంత కష్టపడుతున్నా పార్టీలోనే కొందరు నేతల తీరుతో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో 37 వేల ఓట్ల తేడాతో ఘోర ఓట‌మి :
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం ఎస్సీ రిజర్వుడ్ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోయిన 2009 లాంటి ఎన్నికల్లోను 15 వేల ఓట్ల మెజార్టీతో టిడిపి గెలిచింది.పైగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు బలంగా ఉండే కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఈ నియోజకవర్గంలో 45 వేలకు పైగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఈ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం గోపాలపురం. ఇలాంటి చోట గత ఎన్నికల్లో టిడిపి ఏకంగా 37 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. పార్టీపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతతో పాటు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేయ‌డం కూడా మ‌రో ప్ర‌ధాన కార‌ణం.

ముప్పిడి అస‌లు వ‌ద్దే వ‌ద్దు :
విచిత్రం ఏంటంటే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 2014 ఎన్నికలకు.. ముందు 10 ఏళ్ల నుంచి పార్టీని బతికిస్తూ పార్టీకి బలమైన పునాదులు వేసిన నాయకులను పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పిడి విస్మరించేశారు. ముప్పిడి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి బలమైన నేతలను అణగదొక్కే చర్యలు ప్రారంభించారు. దీంతో ఐదేళ్లపాటు పార్టీ అధికారంలో ఉంది అన్న ఆనందం కూడా ఎవరికి లేదు. ఐదేళ్లు నియోజకవర్గంలో గ్రూపుల పోరు తారస్థాయికి చేరింది. గత ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో మూడొంతుల‌ మంది పార్టీ ప్రజాప్రతినిధులు.. కీలక నేతలు ముప్పిడికి సీటు ఇవ్వద్దు.. పార్టీ ఘోరంగా ఓడిపోతుందని అధిష్టానంకు ఎన్నో ఫిర్యాదులు చేశారు.

ఎన్నికలకు ముందు సీటు కన్ఫామ్ చేస్తున్న సమయంలోను ముప్పిడి వ్యతిరేకులే ఎక్కువమంది ఉన్నారు. చివరకు ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అనంతరం రాజకీయ సమీకరణలు మారాయి. గత ఎన్నికలకు ముందు పార్టీ సీటు ఆశించిన మద్దిపాటి వెంకటరాజు ఏడాది క్రితం కొత్త ఇన్చార్జిగా వచ్చారు. మద్దిపాటి ఇన్చార్జ్ అవ్వటం సహజంగానే ముప్పటికి సపోర్ట్ చేసే వర్గానికి రుచించలేదు. చంద్రబాబు లెక్కలు వేరేగా ఉన్నాయి గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి పార్టీ ఆఫీసుకే పరిమితమై.. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఏమేం చేయాలనే దానిపై రకరకాల ప్రణాళికలతో పాటు ఎన్నో వ్యూహాలు రచించారు.

చంద్ర‌బాబు, లోకేష్‌ను మెప్పించిన మ‌ద్దిపాటి :
ఇవన్నీ చంద్రబాబుతో పాటు యువనేత లోకేష్ కు నచ్చడంతో అతి చిన్న వయసులోనే పార్టీకి గుండెకాయ లాంటి ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పదవి మద్దిపాటికి కట్టబెట్టారు. అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను నియమించారు ఇంత కీలకమైన పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అందులోనూ ఒక యువకుడికి ఇవ్వటం చాలా గ్రేట్. చంద్రబాబును.. లొకేష్ ను తన పనితీరుతో మెప్పించిన వెంకటరాజు చివరకు గోపాలపురం ఇన్చార్జిగా వచ్చారు. పార్టీ ఇన్చార్జిగా వచ్చినప్పటి నుంచి కష్టపడుతూ ప్రజల్లోనే ఉంటూ ముందుకు వెళుతున్నారు.

వెంక‌టేశ్వ‌ర‌రావు భ‌విష్య‌త్తుకు బాబు హామీ :
నియోజకవర్గంలో కొందరు కీలక నేతల నుంచి సహకారం లేకపోయినా.. వెంకటరాజు మాత్రం వాళ్ల విషయంలో ఇప్పటికీ సమన్వయ ధోరణితోనే ముందుకు వెళుతున్న పరిస్థితి. చంద్రబాబు పోలవరం పర్యటనకు వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు భవిష్యత్తు నాది.. వచ్చే ఎన్నికల్లో వెంకటరాజే పోటీ చేస్తారు.. ఆయనను గెలిపించి అసెంబ్లీకి పంపమని బహిరంగంగానే చెప్పేశారు. అయినా నియోజకవర్గంలో కొందరు కీలక నేతలు మద్దిపాటికి సహకరించకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

పార్టీలో బ‌ల‌మైన నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టి ప‌త‌న‌మైన ముప్పిడి :
పార్టీ కార్యక్రమాల్లో మద్దిపాటితో కలిసి పాల్గొనకుండా సొంత ధోరణితో ఏకపోకడలతో ముందుకు వెళుతున్నారు ముప్పిడి. చంద్రబాబు నీ భవిష్యత్తుకు నాది హామీ అని క్లారిటీ ఇచ్చినా కూడా.. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సైతం మద్దిపాటితో కలవకుండా సొంతంగా వెళుతున్న పరిస్థితి. ముప్పిడి ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క‌నేత‌, ద్వార‌కాతిరుమ‌ల దివంగ‌త మాజీ ఎంపీపీ వ‌డ్ల‌మూడి ఈశ్వ‌ర‌భాను ప్ర‌సాద్ వ‌ర్గాన్ని ఇబ్బంది పెట్టేందుకు ట్రై చేసి చేతులు కాల్చుకున్నాడు. ఆయ‌న చ‌నిపోయే వ‌ర‌కు మాత్ర‌మే కాదు.. ఇప్ప‌ట‌కీ వ‌డ్ల‌మూడి ప్ర‌సాద్ వ‌ర్గ‌మే ద్వార‌కాతిరుమ‌ల మండ‌లంలో బ‌ల‌మైన వ‌ర్గం. దీనిని బ‌ట్టే ప్ర‌సాద్ మండ‌లంలో పార్టీకి ఎంత‌ బ‌ల‌మైన పునాదులు వేశారో తెలుస్తోంది. అయినా ఆయ‌నను గిట్ట‌నివ్వ‌లేదు. అటు దేవ‌ర‌ప‌ల్లి మండ‌లంలో మ‌రో దివంగ‌త నేత మాజీ ఏఎంసీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి వెంక‌ట్రావుతోనూ అదే ధోర‌ణితో వెళ్లి పార్టీని నాశ‌నం చేసేశాడు ముప్పిడి.

కేడ‌ర్‌ను ఏకం….
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మద్దిపాటి ఏడాదిలో పార్టీని బలోపేతం చేయటంలో.. దాదాపు మూడు వంతులకు పైగా పార్టీ నేతలను ఏకతాటి మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. తనతో కలిసి వచ్చే వాళ్లను కలుపుకుంటూ.. కలిసి రాని నేతల సహకారం కోసం వేచి చూసే ధోరణితోనే ముందుకు వెళుతున్న పరిస్థితి. విచిత్రం ఏంటంటే కొన్ని అశాస్త్రీయ సర్వేలలో మద్దిపాటి వచ్చాక పార్టీ మైనస్ అయిందని.. ఇక్కడ వైసిపి గెలుస్తుంది అన్న ఫేక్ నివేదికలను మద్దిపాటిని వ్యతిరేకిస్తున్న వర్గం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది.

ఫేక్ స‌ర్వేలు కాదు ఐ ప్యాక్ స‌ర్వేలోనే మ‌ద్దిపాటికి మెజార్టీ :
విచిత్రం ఏంటంటే ఐప్యాక్ నిర్వహించిన ( టైర్ టు ) సర్వేలో కూడా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ గోపాలపురంలో వెంకటరాజు 15వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందటం ఖాయమని తేలింది. అందుకే వైసీపీలో అభ్యర్థి మార్పు ప్రచారం కూడా గత ఏడాది నుంచి జరుగుతుంది. వైసీపీ సర్వేలోను తెలుగుదేశం పార్టీకి ఎంతో సానుకూల వాతావరణం కనిపిస్తే.. ఒకటి రెండు ఫేక్ సర్వేల్లో ఇక్కడ మాత్రమే వైసీపీ ఓడిపోతుందని.. పులివెందుల, పుంగనూరులో కూడా టిడిపి గెలుస్తుందని మద్దిపాటిని వ్యతిరేకించేవాళ్లు ప్రచారం చేస్తుండటం నవ్వులాటగా ఉంది.

మ‌ద్దిపాటిలోనూ లోపాలు ?
పార్టీ కోసం ఎంత కష్టపడుతున్న మద్దిపాటి లోను కొన్ని లోపాలు లేకపోలేదు.. గత ఎన్నికలకు ముందు తనకు సహకరించని నేతలను కేడర్‌ను మరింతగా సమన్వయం చేసుకొని.. తనకు సపోర్ట్ చేసిన నేతలతో సమానంగా కలుపుకోవాల్సిన బాధ్యత ఆయ‌న‌పై ఉంది. అప్పుడే నియోజకవర్గంలో తాను చెప్పిన 37 వేల మెజార్టీ క్రాస్ అవుతుంది. ఇప్పటికైనా గోపాలపురం నియోజకవర్గ టిడిపి ఇక్కడ ఏకతాటి మీదకు వచ్చి.. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తే.. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనే అత్యధిక మెజార్టీ ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం సాధించే గోల్డెన్ చాన్స్ ఉంది. మరి గోపాలపురం తెలుగు తమ్ముళ్లు ఆ సమన్వయం దిశగా ముందుకు వెళతారో లేదో చూడాలి.