ఏపీకి అప్పులు ఇవ్వొద్దు… ఈ వార్నింగ్ ఎవ‌రిది అంటే…!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతుంది. ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు కూడా టైం కు ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ పరువు మంటగలిసిపోయే విషయం ఇది. దేశంలో ఏ రాష్ట్రానికి పట్టని దుస్థితి ఆంధ్రప్రదేశ్‌కే పట్టింది. ఏపీకి అస్సలు అప్పులు ఇవ్వవద్దని.. ఒకవేళ అప్పులు ఇవ్వాలని అనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్లాలని లేకపోతే మీ కొంపలు కొల్లేరు అవుతాయని కాగ్ కుండ బద్దలు కొట్టేసింది.

2021 మార్చి నెల చివరి వరకు ఏపీ ఆర్థిక వ్యవస్థ విశ్లేషించిన కాగ్ ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. గత రెండేళ్లలో ఆర్థిక పరిస్థితులపై కాగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వ్ బ్యాంక్ కూడా అనేక అంశాలను తప్పు పట్టింది. ఏపీకి అప్పులు ఇచ్చేటప్పుడు వివిధ బ్యాంకులు కూడా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. రుణాలను భరించే సామర్థ్యం ఏపీకి లేదని.. రుణం తీసుకుని ఏపీ పాత అప్పులు చెల్లిస్తుందని.. ఆక్షేపన వ్యక్తం చేసింది.

Andhra Pradesh poised on a knife-edge

తీసుకున్న రుణాలను అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించకుండా రుణాలపై వడ్డీలు చెల్లించేందుకు రోజువారి వ్యవహారాలు గడిచేందుకు అప్పు తీసుకోవడం దారుణమని ఇది ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని కాగ్ హెచ్చరించింది. 2020 – 21 ఆర్థిక సంవత్సరం చివరికి మొత్తం బకాయిలు జిఎస్టిపిలో 35 శాతానికి మించకూడదని చట్టం చెబుతున్న… ఏపీ అప్పులు ఏకంగా 35.30% ఉన్నాయని కాగ్ తేల్చింది. బడ్జెట్లో చూపించని బయట నుంచి తీసుకున్న రుణాలు కూడా చూస్తే ఇది ఏకంగా 44.04% గా ఉందని స్పష్టం చేసింది.

రాబోయే ఏడు సంవత్సరాల లో 45.74% అంటే 1,23, 640 కోట్ల అప్పులు ఏపీ తీర్చాలని చెప్పింది. దీనికి సంబంధించి సరైన వ్యూహం లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు తగ్గిపోతాయని కాగ్ వారిని హెచ్చ‌రించింది. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల్లో 81 శాతం రెవెన్యూ ఖర్చులకే వాడుతోందని.. దీంతో ఆదాయం త‌గ్గుతోందని.. వీటిని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులో ఆర్థిక సంస్థలు ఏపీకి అప్పులు ఇచ్చే విషయంలో ఆలోచన చేయాలని కాగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఏదేమైనా కాగ్ చెప్పిన దానిని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎంత అతలాకుతలంగా ఉందో తెలుస్తోంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp