ఏపీలో ఎన్నిక‌లు ఎప్పుడంటే… ప‌క్కా క్లారిటీ…!

ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ఆ మాటకొస్తే దేశంలో రాజకీయ పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు వచ్చే ఎన్నికలలో అధికారం లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న వాళ్లకు కాస్త సానుకూల అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్షాలను అణిచివేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ లో జరగాల్సి ఉంది.

అయితే వీటిని నవంబర్ డిసెంబర్ నెలలో జరిపేలా కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని వైసిపి పెద్దలు తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్చార్జిల‌కు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో తమపై కొంతవరకు వ్యతిరేక పవనాల వీస్తున్నాయని గ్రహించిన బిజెపి పెద్దలు.. ఐదారునెలల‌ ముందుగానే జమిలీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలలో ఎన్నికలకు సంబంధించి కీలక బిల్లు ఆమోదించే అవకాశాలు మెండుగా ఉన్నాయని జాతీయ మీడియా ప్రచారం చేస్తుంది. ఈ నెలాఖరుకు ముందస్తు ఎన్నికలపై ఒక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా లోక్సభ తో పాటు దాదాపు పది రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కలిపి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని కూడా సమాచారం. దీనిపై ఈ నెలాఖరులో పూర్తి క్లారిటీ రానుంది.