ఇప్పుడు టీడీపీ చేయాల్సిందేంటి… చేస్తోందేంటి…!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీకి గ‌డిచిన 40 ఏళ్ల‌లో అనేక దెబ్బ‌లు త‌గిలాయి. ఏవీ కొత్త కాదు. ఏదీ పాత‌దీ కాదు. ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత‌లుగా ఉన్న వారికి కూడా అనేక ఇబ్బందులు, కేసులు, స‌వాళ్లు ఎదుర‌య్యాయి. గ‌తంలో అన్న‌గారు ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్చుతుడిని చేసిన నాడు.. పార్టీలో 1990ల‌లో త‌లెత్తిన సంక్షోభం నాడు.. 2004, 2009ల‌లో వ‌రుస ప‌రాజ‌యాలు పొందిన నాడు.. పార్టీ భ్ర‌మ‌సి పోలేదు. ప‌ట్టు త‌ప్ప‌లేదు. క‌ట్టు వీడ‌లేదు.

నేడు.. కొంద‌రు చెబుతున్న మాట ఏంటంటే.. వాటి కంటే కూడా ఇప్పుడు చంద్ర‌బాబు అరెస్టు పెద్ద‌ద‌ని!! కానీ, వాస్త‌వానికి ఈ ప‌రిణామం చంద్ర‌బాబు ఊహించ‌నిదైతే కాదు. ఆయ‌నే స్వ‌యంగా త‌న అరెస్టు గురించి, త‌న‌ను జైలుకు పంపించేందుకు జ‌రుగుతున్న కుట్ర గురించి కూడా ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు. సో.. టీడీపీకి త‌గిలిన దెబ్బ‌లు, అయిన గాయాలు.. వంటి వాటితో పోల్చితే.. కొంత మేర‌కు ప్ర‌స్తుతం జ‌రిగింది పెద్ద‌ది కావొచ్చేమో కానీ, భారీ దెబ్బయితే కాద‌నేది విశ్లేష‌కుల మాట‌.

వైసీపీ నాయ‌కులు లేదా మంత్రులు ఊహిస్తున్న‌ట్టుగా ఇక‌, టీడీపీ ప‌రిస్థితి అయిపోయింద‌ని, ఆ పార్టీ పుట్టి మునిగిపోతుంద‌ని అనుకోవ‌డం భ్ర‌మే. ఇదిలావుంటే, ఇప్పుడు టీడీపీ ఎదుర్కొంటున్న‌ది కొంత మేర‌కు విప‌త్క‌ర ప‌రిస్థితి అన‌డంలో సందేహం అయితే లేదు. కానీ, దీని నుంచి గ‌ట్టెక్కేందుకు, పార్టీ అధినేత‌ను కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. జ‌రుగుతా యి కూడా. ఇక‌, ఇప్పుడు టీడీపీ చేస్తున్న‌ది కేవ‌లం మీడియా మీటింగులు, లేదా కొంత మేర‌కు నిర‌స‌న‌లు.

అయితే, ఇప్పుడు నిజానికి టీడీపీకి కావాల్సింది.. `దీనికి మించి` అనే భావ‌న స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌టి.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు గ‌డ‌ప‌గడ‌పకు తిర‌గ‌డం. పార్టీ విష‌యంలోనూ, చంద్ర‌బాబు విష‌యంలో ను అక్ర‌మం జ‌రిగింద‌ని, అన్యాయంగా ఆయ‌నపై కేసులు బ‌నాయించార‌ని చెబుతున్న నాయ‌కులు ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్ల‌డం ప్ర‌ధాన క‌ర్త‌వ్యం. ఇక‌, రెండో విష‌యం.. కీల‌క నేత‌లు ఇప్ప‌టికే విభేదాల‌ను ప‌క్క‌న పెట్టి ముందుకు క‌లిసి సాగేందుకు చేతులు క‌లిపారు.

ఈ ప‌రిణామం ఆహ్వానించ‌ద‌గిన విష‌యం. విప‌త్క‌ర ప‌రిస్థితిలోనే, క‌ష్ట కాలంలోనే ఎవ‌రి బ‌ల‌మైనా తెలుస్తుంది. సో.. అది ఇప్పుడు టీడీపీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే, దీనిని మ‌రింతగా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా నాయ‌కులు క‌ల‌సి క‌ట్టుగా కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. నిన్న‌టి వ‌ర‌కు టికెట్ వ‌స్తుందో రాదో అనే బెంగ‌తో ఉన్న‌వారు. ఇప్ప‌టి కే కొన్ని టికెట్లు ఖ‌రారైన వారు కూడా.. నియోజ‌క‌వ‌ర్గ‌, మండ‌ల స్థాయిలో ప్ర‌జ‌ల‌ను క‌లుపుకొని కార్య‌క్ర‌మాల‌కు య‌థాశ‌క్తి రూప‌కల్ప‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

రాష్ట్రానికి.. చంద్ర‌బాబు అవ‌స‌రం, ఈ రాష్ట్రానికి చంద్ర‌బాబు ఉనికి వంటివి ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లి.. పార్టీని అదేస‌మ‌యంలో అధినేత‌కు మ‌ద్ద‌తుగా క్షేత్ర‌స్థాయిలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తేనే ఫ‌లితం ఉంటుంద‌నేది విశ్లేష‌కుల మాట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.