టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు.. జైలు.. అనంతర పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. మొదటి రోజు.. అనంతరం కూడా.. ఈ విషయంలో ఎవరికీ అంతగా స్పష్టత లేకపోవడంతో రాష్ట్ర స్థాయిలోనూ.. జాతీయ స్థాయిలోనూ నాయకులు స్పందించేందుకు కొంత సమయం పట్టింది. అయితే, తర్వాత నుంచి మాత్రం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ జాతీయ స్థాయి నేతలు కామెంట్లు కుమ్మరించారు.
వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగిన కుమార స్వామి(కర్ణాటక మాజీ సీఎం) వంటి వారితో పాటు జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సహా యువ నాయకులు అఖిలేష్ యాదవ్ వంటి వారు ఉన్నారు. ఇక, రాష్ట్రంలోనూ టీడీపీ, సీపీఐ, జనసేన, ఎమ్మార్పీఎస్ వంటి పార్టీలు కూడా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించాయి. అంతేకాదు, ఆయనకు సంఘీభావంగా సభలు, సమావేశాలు నిర్వహించి.. వైసీపీ సర్కారు దమన నీతిని ఎండగట్టాయి.
ఇక, రాష్ట్రంలో పరిస్థితిని గమనిస్తే.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. టీడీపీ నాయకులు రోడ్ల మీదకు వచ్చారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల మంది కార్యకర్తలు, మరో 2 వేల మంది నాయకులపై కేసులు పెట్టామని అధికారికంగా పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా నిర్వహించగా.. ఒకటి రెండు ప్రాంతాలు మినహా.. సీమ సహా కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలు సహకరించారు. చంద్రబాబు అరెస్టును నిరసించారు.
కట్ చేస్తే.. అసలు విషయం ఏంటంటే.. చంద్రబాబు అరెస్టుపై ఎవరూ స్పందించలేదని, ఆ పార్టీలో కీలక నేతలు ఎవరూ ముందుకు రాలేదని, అసలు గొంతు కూడా విప్పలేదని వారంతా భయంతో హడలి పోతున్నారని.. వైసీపీ నాయకులు తమ అనుకూల మీడియాల్లో హోరెత్తిస్తున్నారు. అంతేకాదు, జాతీయ స్థాయిలో చక్రం తిప్పానని చెప్పుకొనే చంద్రబాబుకు జాతీయ స్థాయిలో కూడా ఎవరూ సంఘీభావం పలక లేదని రాసుకొచ్చాయి.
ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు రామాయణంలో (ఇక్కడ చంద్రాయణం అనుకో వచ్చు) పిడకల వేట అంటే ఇదే అంటూ పెదవి విరుస్తున్నారు. మరీ ఇంత సెల్ఫ్ గోల్ ఎందుకని వారు నిలదీస్తున్నారు. మరీ ఇంతగా బరితెగించి.. లేనిది కూడా ప్రచారం చేసుకోవడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.