ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముక్కి మూలిగి నాలుగు మెడికల్ కాలేజీ లను పూర్తి చేయకుండానే ప్రారంభిస్తున్నారు జగన్ తాజాగా ప్రారంభించే విజయనగరం మెడికల్ కాలేజ్ లోనే పనులు ఇంకా 30 శాతానికి పైగా మిగిలిపోయి ఉన్నట్టు తెలుస్తుంది. వాటికన్నా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు చాలా పెద్దగా ఉంటాయన్న జోకులు పేలుతున్నాయి. కానీ వేల కోట్ల అప్పులు మెడికల్ కార్పొరేషన్ నుంచి చేసి కేవలం నాలుగు మెడికల్ కాలేజీలకు మాత్రమే అనుమతులు తెచ్చుకోగలిగారు. వాటినే ఇప్పుడు ప్రారంభించనున్నారు.
ఇందులోను పేదలకు విద్య అందుబాటులో ఉంటుందంటే సందేహంగానే కనిపిస్తోంది. ఏపీలో జిల్లాకు మెడికల్ కాలేజీ పెడతానని చెప్పి శంకుస్థాపనలు చేసిన ముఖ్యమంత్రి.. చివరికి అతికష్టం మీద నాలుగు మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లు నిర్వహించడానికి అనుమతులు తీసుకువచ్చారు. దీనికోసం కూడా ఎన్నో ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ఈ కాలేజీలో నిర్వహణకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవట.
అందుకే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎవరైనా సరే లక్షల్లో ఫీజులు చెల్లించాల్సిందే అంటూ జీవో ఇచ్చింది. మరి ఈ లెక్కన చూస్తే బడుగు బలహీన వర్గాలకు వైద్య విద్య దూరం అయినట్టు కదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వ కాలేజీలు ఉన్నది ప్రజలకు సాయం చేయడానికి .. చదువు కొనలేని వారికి అవకాశం కల్పించడానికి.. ప్రభుత్వ కాలేజీ అంటే తక్కువ ఫీజు ఉంటుందన్న నమ్మకం ప్రజలకు ఉంటుంది.
కానీ ఏటా 60 – 70 లక్షలు ఫీజులు పెడితే ఇక ప్రభుత్వ కాలేజీల్లో సామాన్యులు చదువుకునే పరిస్థితి ఉంటుందా ? అన్నది ప్రభుత్వానికి తెలియాలి. తెలంగాణలో కేసీఆర్ ఒక్కరోజే ఏకంగా తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నారు. గత ఏడాది ఎనిమిది మెడికల్ కాలేజీలను ఒకేరోజు ప్రారంభించారు. ఈ ఏడాది మరో తొమ్మిది కాలేజీలను ప్రారంభిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ రంగంలోనే అంటే రెండేళ్లలో 16 కాలేజీల ప్రారంభమవుతున్నాయి. మరి ఈ లెక్కన ఏపీలో జగన్ జిల్లాకో కాలేజ్ అని 26 కాలేజ్‌లు ఏర్పాటు చేయాల్సింది పోయి నాలుగు కాలేజ్‌లు అది కూడా సగం సగం పూర్తయిన కాలేజ్‌లు ఏర్పాటు చేయడం నిజంగానే కామెడీ అని చెప్పాలి.