ఏపీలో అధికార వైసీపీని గద్దె దించేందుకు ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన ఏకమవుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయిన వెంటనే లోకేష్ – బాలయ్య సమక్షంలోనే వచ్చే ఎన్నికలలో జనసేన – టిడిపి కలిసి పోటీ చేస్తున్నాయని ప్రకటించారు. దీంతో పొత్తుపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఏఏ సీట్లలో జనసేన పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏఏ సీట్లను త్యాగం చేయాలి ? అన్నదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
విశ్వసనీయవర్గ సమాచారం ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, ఎచ్చెర్ల – విజయనగరం జిల్లాలో ఎస్ కోట – నెల్లిమర్ల – విశాఖపట్నం జిల్లాలో గాజువాక, భీమిలి, విశాఖ నార్త్, చోడవరం, ఎలమంచిలి, పాయకరావుపేట, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, రాజోలు, పి గన్నవరం, కాకినాడ రూరల్, పిఠాపురం – పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, నిడదవోలు – కృష్ణా జిల్లాలో పెడన, విజయవాడ పశ్చిమ, గుంటూరు జిల్లాలో తెనాలి, గుంటూరు పశ్చిమ, ప్రకాశం జిల్లాలో గిద్దలూరు స్థానాలపై జనసేన కన్నేసినట్టు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి అటు అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ సీట్లు కూడా జనసేన అడిగే ఛాన్సులు ఉన్నాయి. ఓవరాల్ గా రాయలసీమలో జనసేన ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశం లేదని కోస్తా, గోదావరి జిల్లాలు , ఉత్తరాంధ్ర జిల్లాలను నుంచే జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుందని తెలుస్తోంది. అలాగే ఎంపీ సీట్ల విషయానికి వస్తే కాకినాడ, నరసాపురం, అమలాపురం, రాజంపేట లేదా చిత్తూరు, తిరుపతి స్థానాలలో ఒకచోట నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ సీట్లలో తెలుగు తమ్ముళ్లు త్యాగాలకు సిద్ధం కాక తప్పని పరిస్థితి.