గుడివాడ యుద్ధం.. కొడాలికి కాకే….!

అన్నీ ఒకేలా ఉండ‌వు అన్నట్టుగా.. అన్ని ఎన్నిక‌లు కూడా ఒకేలా ఉండే ప‌రిస్థితి ఉండ‌దు. 2019లో ఉన్న రేంజ్‌లో 2024లోనూ ఉంటాయా? అంటే.. దానికి మించి అన్న‌ట్టుగా రాజ‌కీయాలు మారాయి. వ‌చ్చే ఎన్నిక లు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారుతున్నాయి. ముఖ్యంగా కీల‌క నేత‌ల విష యంలో ప్ర‌త్య‌ర్థులు తీసుకుంటున్న స్టెప్స్ రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించింది. ఈ కోవ‌లోనే ఇప్పుడు గుడివాడ కూడా కాకెత్త‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం వ‌రుస విజ‌యాల‌తో మాజీ మంత్రి కొడాలి నాని దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌న‌కు తిరుగులేద‌ని ఆయ‌న భావిస్తున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. టీడీపీ త‌ర‌ఫున బ‌ల మైన నాయ‌కుడు ఇక్క‌డ లేకుండా పోయార‌ని అనుకోవ‌డ‌మే. నిజానికి 2019 ఎన్నిక‌ల్లో దేవినేని అవినాష్ ఇక్క‌డ నుంచి పోటీ చేశారు. బ‌ల‌మైన పోటీ అనుకున్నా.. చివ‌రి నిమిషంలో ఇబ్బందులు రావ‌డంతో ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత రావి వెంక‌టేశ్వ‌ర‌రావును టీడీపీ ఇంచార్జ్‌గా నియ‌మించారు.

కానీ, వ‌చ్చే ఎన్నిక‌లు మ‌రింత వేడిగా ఉండ‌డం. బ‌ల‌మైన వ్య‌క్తి అవ‌స‌రం ఇక్క‌డ కావాల్సి ఉండ‌డంతో టీడీపీ వ్యూహం మార్చుకుని ప్ర‌వాసాంధ్రుడైన వెనిగ‌ళ్ల రాముకు ఇక్క‌డ టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించు కుంది. ఇదే జ‌రిగితే.. గుడివాడ భీక‌ర యుద్ధాన్నే త‌ల‌పిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకం టే.. ఆర్థికంగానే కాకుండా.. స్తానికంగా కూడా.. త‌న‌కు తిరుగులేని మాస్ ఇమేజ్‌తో దూసుకు పోతున్న కొడాలికి వెనిగ‌ళ్ల అడ్డుక‌ట్ట వేస్తార‌నే చ‌ర్చ ఉంది.

పైగా.. జ‌న‌సేన‌-టీడీపీ క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్తుండ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు వెనిగ‌ళ్ల రాముకు పూర్తిగా స‌హ‌క‌రించాల‌నే వ్యూహం ఉంది. మ‌రోవైపు ఆర్థికంగా వెనిగ‌ళ్ల రాముకు మంచి ప‌ర‌ప‌తి ఉంది. ఇప్ప‌టికే ఏడాది కాలం పైగానే ఆయ‌న గుడివాడ ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. క‌ష్ట‌ల్లో ఉన్న వారికి అప్ప‌టిక‌ప్పుడు ఆర్థిక సాయం అందిస్తున్నారు. వెనిగ‌ళ్ల పౌండేష‌న్ త‌ర‌ఫున ఎన్నారైల ద్వారా ఇక్క‌డ సాయం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వెనిగ‌ళ్ల రాము పేరు మార్మోగుతోంది.

ఎటు విన్నా.. ఎటు చూసినా.. నిత్యం ఆయ‌న గుడివాడ‌లో క‌నిపిస్తున్నారు. ఆయ‌న వాయిస్ కూడా వినిపి స్తోంది. దీంతో ఎప్పుడు ఏ స‌మ‌స్య వ‌చ్చినా. ప్ర‌జ‌లు వెనిగ‌ళ్ల వ‌ద్ద‌కే వెళ్తున్నారు. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కులు కూడా వెనిగ‌ళ్ల‌కు పూర్తిగా స‌హ‌క‌రించేందుకు ముందుకు వ‌చ్చారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. గుడివాడ‌లో యుద్ధం ప్రారంభ‌మైపోయింద‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు. కొడాలికి ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచినంత ఈజీ అయితే.. కాద‌ని చెబుతున్నారు. ఓట‌మి త‌ప్ప‌ద‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.