ఇక చంద్ర‌బాబు అస‌లు ఆట అక్క‌డ నుంచే మొద‌లు…!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత నిరాశా నిస్పృహలతో ఉన్న టిడిపి నేతలకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చి ఊపిరి పోసింది హైకోర్టు. తర్వాత పూర్తిగా బెయిల్ ఇచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో జగన్ పరిపాలన ఆపడమే లక్ష్యంగా టిడిపి వ్యూహరచన చేస్తుంది. జగన్ అవినీతిని ప్రజలకు తెలియజేయడానికి టిడిపి ప్రయత్నిస్తోంది. భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ అంటూ టిడిపి ఆరు పథకాల మ్యానిఫెస్టోతో ప్రజలలో చంద్రబాబు ప్రచారం ప్రారంభించారు.

కానీ ఆ కార్యక్రమం నుంచి నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేశారు. అప్పటితో ఆ క్షణం నుండి నంద్యాలలో భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ కార్యక్రమం ఆగిపోయింది. దానితో పాటు యువగళం పాదయాత్రను కూడా లోకేష్ ఆపేశారు. ఇప్పుడు చంద్రబాబుకు పూర్తిగా బెయిల్ రావడంతో టీడీపీ నేతలు నూతన ఉత్సాహంతో మళ్లీ ఈ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించారు.

భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ ఈ కార్యక్రమాన్ని ఎక్కడైతే ఆపారో అక్కడ నుండే అంటే నంద్యాల నుంచి చంద్రబాబు తిరిగి ప్రారంభిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గతంలో కన్నా ఇప్పుడు నూతన ఉత్సాహంతో ప్రజల ముందుకు వెళతారని, తాము ఇవ్వాలనుకున్న మేనిఫెస్టోను, ప్రజలకు చేయాలనుకొన్న మంచిని ఇంటింటికి చేరవేస్తామని చంద్రబాబు చెబుతున్నారు.

చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తర్వాత టిడిపి క్యాడర్ లో రెండు రెట్ల నూతన ఉత్సాహం పెరిగిందని, ఆ ఉత్సాహంతో ఈసారి కచ్చితంగా అధికారంలోకి వచ్చేది తామేనని, ఇప్పుడు తమకు జనసేన మద్దతు కూడా ఉండడంతో వైసీపీని ఓడించటం సునాయాసం అవుతుందని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.