సెలక్ట్ కమిటీల ఏర్పాటు అంశఃం రోజుకో మలుపు తిరుగుతున్నది. పరిస్థితి అంతా శాసనమండలి చైర్మన్ వర్సెస్ శాసనమండల సెక్రటరీగా మారిపోయింది. దీంతో ఇప్పుడేం జరుగుతుందా? అన్న ఉత్కంఠత నెలకొన్నది. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టసవరణ బిల్లులను శాసన మండలిలో ప్రవేశపెట్టకుండానే విచక్షణా అధికారాల పేరిట సెలక్ట్ కమిటీకి పంపి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చారు మండలి చైర్మన్ షరీఫ్. ఇదిలా ఉండగా చైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సెలక్ట్ కమిటీల ఏర్పాటు సాధ్యం కాదని ఫైలును తిప్పి పంపి చైర్మన్‌కు షాక్ ఇచ్చారు మండల సెక్రటరీ. దీంతో అప్పటి వరకు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య వివాదంగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు కాస్తా చైర్మన్ వర్సెస్ సెక్రటరీగా మారిపోయింది.
ఇదిలా ఉండగా.. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు ససేమిరా అంటూ సెక్రటరీ రెండు సార్లు తన ఆదేశాలను ధిక్కరించడంపై మండలి చైర్మన్ షరీఫ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా గవర్నర్ హరి చందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు . శాసనమండలి ఇచ్చిన రూలింగ్ ను అమలు చేయడం లేదని, సెక్రటరీని తొలగించాలని షరీఫ్ ఫిర్యాదు చేశారు. దీనిపై గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠత ఒకవైపు కొనసాగుతుండగానే తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. గవర్నర్‌కు మండలి చైర్మన్ ఫిర్యాదు చేయడంపై అధికారులు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. శాసన మండలి సెక్రటరీకి బాసటగా నిలుస్తున్నారు. అదీగాక ఏకంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎస్ నీలం సాహ్నిని కలవడం చర్చనీయాంశంగా మారింది. రూల్స్‌కు అనుగుణంగా పని చేసే అధికారులకు భద్రత కల్పించాలని సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరడం గమనార్హం. దీంతో ఈ అంశంగా మరింత ఆసక్తికరంగా మారింది.