ఆయన నియోజకవర్గంలో ఎక్కడ అడుగు వేసినా.. ప్రజాదరణే. ఎవరిని పలకరించినా పేరు పెట్టే. ఎక్కడా తడబాటు లేదు. అందరితోనూ ఆప్యాయ పలకరింపే.. ఆదరణీయ అభిమానమే. ఆయనే వినుకొండ మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకుడు జీవీ ఆంజనేయులు. ప్రస్తుతం ప్రజల్లో ముమ్మరంగా తిరుగుతున్న ఆయన.. తనకు ఎవరు ఎదురైనా పేరుపెట్టే పలకరిస్తున్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడడమే కాదు.. వారి ఆరోగ్య వివరాలను, కుటుంబ వివరాలనుకూడా అడిగి తెలుసుకుంటున్నారు.
తద్వారా.. ప్రజలకు మరింత చేరువ అయ్యేలా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఎన్నికలు జరిగి దాదాపు ఐదేళ్లు అయినా.. జీవీపై ప్రజల్లోనూ అదే అభిమానం కనిపిస్తుండడం గమనార్హం. అంతేకాదు.. జీవీని ఎంత తొందరగా మళ్లీ ఎమ్మెల్యేగా చూస్తామని కూ డా.. చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో జీవీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప.. ప్రస్తుతం ఎలాంటి అబివృధ్ధీ లేదని స్పష్టం చేస్తుండడం గమనార్హం. అంతేకాదు.. గత టీడీపీ హయాంలో జరిగిన మేళ్లను ప్రస్తావిస్తున్నారు.
అయితే.. ఇదే సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహారంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఎవరినీ పేరు పెట్టి పిలిచే పరిస్థితి లేదు. కేవలం తమ్ముడు, అమ్మా తప్ప.. క్షేత్రస్థాయిలో ఆయనకు ప్రజలతో ఆశించిన అనుబంధం కానీ.. ఆప్యాయతలు కానీ లేకపోవడం గమనార్హం. అంటే.. ఆయన ప్రజలకు ఏమేరకు చేరువయ్యారనేది దానిని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు.. జీవీ హయాంలో తమకు రోడ్డు వచ్చిందని.. తమ వీధికి కుళాయి వచ్చిందని.. తమ పిల్లలకు విదేశీ విద్య అందిందని.. ఇలా.. చెప్పుకోవడానికి అనేక అంశాలు ఉన్నాయి.
కానీ, ఎమ్మెల్యే బొల్లా హయాంలో నేరుగా సీఎం ఇస్తున్న పథకాలే అందుతున్నాయి తప్ప.. తమకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే చేస్తున్నది ఏమీ లేదని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడుతుండడం గమనార్హం. నిజానికి ఏనాయకుడైనా ప్రజలకు చేరువ కావాలి. ప్రజలు కూడా సదరు నాయకుడికి చేరువ కావాలి. కానీ, ప్రజలకు ఆమడదూరంగా.. అవసరమైనప్పుడు వారికి చేరువగా ఉంటున్న బొల్లా విషయంలో ప్రజలుకూడా అలానే స్పందిస్తుండడం గమనార్హం. జీవీని అన్నా అనే ప్రజలు.. బొల్లాను.. దూరంగా ఉంచడం.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందనే విషయాన్ని స్పష్టం చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.