టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఆ ఏడాది జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయాత్ర ఈ నెల 17న ముగియనుంది. వాస్తవానికి ఇచ్ఛాపురం వరకు సుమారు 4 వేల కిలోమీటర్ల దాకా నడిచి.. రికార్డు సృష్టించాలని అనుకున్నారు. అయితే.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ యాత్రకు బ్రేకులు పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అనుకున్న విధంగా యువగళం ముందుకు సాగలేదు.
దీంతో యాత్ర నిర్దేశిత.. లక్ష్యాన్ని కుదించుకుని.. ఎక్కడ వరకు అయితే అక్కడ ఈ నెల 17న యువగళం పాదయాత్రను ముగించేయాలని నిర్ణయించారు. మరి ఈ యువగళం యాత్ర ముగిసిన తర్వాత ఏంటి. అనేది ఇప్పుడు టీడీపీ నేతల మధ్య ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికలకు సమయం లేనందున.. ఆ వెంటనే ఈ నెల 25 లేదా 26 తర్వాత.. నారా లోకేష్ బస్సు యాత్రకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
మొత్తం రెండు ప్రాంతాల్లో నారా లోకేష్ యాత్ర సాగుతుందని పార్టీలో చర్చ సాగుతోంది. పాదయాత్ర సాగని ప్రాంతాలు సహా.. కోస్లా, ఉత్తరాంధ్రల్లో నారా లోకేష్ బస్సు యాత్ర ఉంటుందని చెబుతున్నారు. అదేసమయంలో చంద్రబాబు కూడా బస్సు యాత్ర చేయనున్నారు. ఈయన సీమవైపు దృష్టి పెట్టి.. వైసీపీ సెంటిమెంటును టార్గెట్ చేసుకుని టీడీపీని బలోపేతం చేయాలని చూస్తున్నారు.
ఇక, పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రను చేపట్టి.. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలనే ప్లాన్ తెలిసిందే. అంటే.. వైసీపీపై ఇటు నారా లోకేష్, అటు చంద్రబాబు, మరోవైపు.. పవన్‌లు ఒకేసారి యాత్రల ద్వారా యుద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిని ఒకవైపు సాగిస్తూనే వారాంతాల్లో నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు విషయంపైనా దృష్టి పెట్టనున్నారు.
అదే సమయంలో మేనిఫెస్టోను మరింత పక్కాగా రూపొందించేందుకు చర్చలు చేపట్టనున్నారు. మొత్తంగా చూస్తే.. యువగళం తర్వాత. అదిరిపోయే మాస్టర్ ప్లాన్‌తో టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది.