స్టార్ మాలో ప్రసారం కానున్న ‘విక్రమ్’..రికార్డ్స్ బద్దలవుతాయా?

కమల్ హాసన్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రమ్’.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జూన్ 3న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కమల్ హాసన్ కోల్పోయిన బాక్సాఫిస్ పూర్వ వైభవాన్ని ఈ సినిమా మళ్లీ తీసుకొచ్చింది. ఎన్నో ఫ్లాప్ సినిమాల తర్వాత కమల్ హాసన్ కి పెద్ద హిట్ అందింది. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. నటుడు సూర్య కూడా కీలకపాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ కి చెంది రాజ్ కమల్ బ్యానర్ పై.. కమల్ హాసన్, ఆర్.మహేందర్ భారీ ఎత్తున నిర్మించారు. విక్రమ్ సినిమా రాజ్ కమల్ బ్యానర్ లో వచ్చిన 50వ సినిమా విక్రమ్.

ఈ సినిమాకు థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ రన్ ముగించుకున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జూలై 8 నుంచి హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం టీవీలో ప్రసారం అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 11న సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది.


ఈ చిత్రం తెలుగులో కూడా అతి పెద్ద హిట్ గా నిలిచింది. తెలుగులో 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తే 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక తమిళంలో అయితే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సెప్టెంబర్ 11న టెలికాస్ట్ కానుంది. థియేటర్లలో, ఓటీటీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన విక్రమ్.. టెలివిజన్ లో ఎంత రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి.

విక్రమ్ సినిమా కలెక్షన్స్ లోనూ అదరగొట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా 404 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసింది. రజనీకాంత్ నటించిన 2.0 తర్వాత 400 కోట్ల క్లబ్ లో చేరిన రెండో తమిళ చిత్రంగా విక్రమ్ నిలిచింది. ఓవర్సీస్ లో 120 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ మూవీ తమిళనాడులో బాహుబలి-2 కలెక్షన్లను సైతం బ్రేక్ చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ తమిళనాడులో 155 కోట్ల రూపాయలు రాబట్టగా.. విక్రమ్ సినిమా దాదాపు మూడు వారాల్లోనే ఈ మార్క్ ను చేరుకుంది..

ఈ సినిమా కమల్ హాసన్ కెరీర్ లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కమల్ హాసన్ త్వరలోనే నాలుగు క్రేజీ సీక్వెల్స్ చేస్తున్నారట.. ప్రస్తుతం ఆయన భారతీయుడు-2 షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం రిలీజ్ కానుంది. దీంతో పాటు మరో హిట్ మూవీ రాఘవన్ పార్ట్-2 చేస్తున్నారట. వీటితో పాటు విజయ్, కార్తీలతో సినిమాల తర్వాత విక్రమ్-2 మూవీ చేయనున్నారు. ఇవే కాకుండా శభాష్ నాయుడుకు కూడా సీక్వెల్ రాబోతుంది..

Tags: kamal hassan, Star Maa, TV telecast, Vikram cinema