విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్నది. తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్, మంజూవారియర్ జంటగా నటించిన ఈ చిత్రం కోలివుడ్‌లో రికార్డు స్థాయిలో రూ. 150 కోట్ల గ్రాస్‌ను షేర్ చేసింది. అయితే తెలుగులో ఈ సినిమాను సురేష్ ప్రోడక్షన్, వీ మీడియా కళైపులి థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కొత్తబంగారు లోకం సినిమా ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఆయన సరసన మళయాళి భామా ప్రియామణి నటిస్తున్నది.
ఇదిలా ఉండగా.. ఇటీవలే సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను అనంతపురం పరిసర ప్రాంతాల్లో పూర్తి చేశారు. ప్రస్తుతం తమిళ నాడు లోని కురుమలైలో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో సినిమాకు సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అవి పూర్తయ్యాక తిరిగి అనంతపురంలో ఆ షెడ్యూల్‌ను తిరిగి కొనసాగించనున్నారు. అయితే ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం మరో హీరోయిన్, మలయాళి భామా అమలా పాల్‌ను కూడా తీసుకునేందుకు చిత్రబృందం ప్రయత్నాలను ముమ్మరం చేసిందట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా నడిచాయని త్వరలోనే ఆమె కూడా సెట్స్ పైకి రానుందని విశ్వసనీయ సమాచారం.