వెంకిమామ రివ్యూ అండ్ రేటింగ్‌..!

విడుద‌ల తేది : 13 డిసెంబర్ 2019

న‌టిన‌టులు :  విక్ట‌రీ వెంకటేష్,  అక్కినేని నాగచైతన్య, పాయ‌ల్ రాజ్‌పుత్‌, రాశీఖ‌న్నా, నాజ‌ర్‌, రావురమేష్, చమ్మక్ చంద్ర,  బ్రహ్మాజీ

ద‌ర్శ‌క‌త్వం : కె.ఎస్.రవీంద్ర (బాబీ)

సంగీత ద‌ర్శ‌కుడు : ఎస్.తమన్

ఛాయాగ్ర‌హ‌కుడు : ప్రసాద్ మూరెళ్ళ

నిర్మాత‌లు :  ద‌గ్గుబాటి సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్

నిర్మాణ సంస్థ‌లు : సురేష్ ప్రొడక్షన్స్,  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేష‌న్‌.

నిజ జీవితంలో విక్ట‌రీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య‌కు మేన‌మామ‌. విక్ట‌రీ వెంక‌టేశ్‌ సోద‌రితో టాలీవుడ్ మ‌న్మ‌థుడు అక్కినేని నాగార్జున‌కు వివాహం అయింది. త‌రువాత కొన్ని కార‌ణాల‌తో ఇద్ద‌రు విడాకులు తీసుకోవ‌డం జ‌రిగింది. నాగార్జున కొడుకు నాగ‌చైత‌న్య‌. నిజంగానే మామా అల్లుండ్లు అయిన వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య రీల్ జీవితంలో అవే పాత్ర‌ల‌ను పోషించారు. ఎఫ్ 2 లాంటి సూపర్ సక్సెస్ తర్వాత వెంకటేష్, మజిలీ లాంటి డీసెంట్ హిట్ త‌రువాత  నాగచైతన్య నటించిన చిత్రం వెంకి మామ. మల్టీస్టారర్ సినిమాగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో మాత్రం కాస్త టెన్షన్ పడి.. ఇంకాస్త టెన్షన్ పెట్టి ఎట్టకేలకు విక్ట‌రీ వెంక‌టేశ్ పుట్టిన రోజు కానుక‌గా నేడు విడుదలైంది. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న‌ రాశీఖన్నా, వెంక‌టేశ్ కు జోడి గా పాయల్ రాజ్ పుత్  నటించిన ఈ ఫ్యామిలీ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆక‌ట్టుకుందో ఓసారి లుక్కేద్దాం.

కథ:   అదో ప‌ల్లేటూరు.. ఆ ఊరులో వెంక‌ట్ సూర్య‌నారాయ‌ణ ఉండేవాడు. ఆయ‌నే వెంకిమామ‌(వెంక‌టేశ్‌). ఆయ‌న‌ మేనల్లుడు కార్తీక్ (నాగచైతన్య). కార్తీక్  కోసం పెళ్లి కూడా చేసుకోకుండా.. వాడి ఆనందమే తన ఆనందంగా బ్రతుకుతుంటాడు వెంకిమామ. చిన్న‌నాటి నుంచి పెండ్లీడు వ‌చ్చేవర‌కు త‌న‌తోనే బ‌తికిన మేన‌ల్లుడు అనుకోకుండా మామ‌కు దూర‌మ‌వుతాడు.  తన భుజాల మీద పెరిగిన మేనల్లుడు, తనతో కలిసి మందుకొట్టిన మేనల్లుడు ఒక్కసారి దూరమవ్వ‌డాన్ని త‌ట్టుకోని వెంకిమామ అల్లుడికి  దగ్గరవ్వాలని ప్రయత్నించినా కార్తీక్‌ కనికరించడు. తనే ప్రాణంగా పెంచిన‌ మేనల్లుడు తనను ఎందుకు వ‌దిలి దూరం అవుతున్నాడో.. త‌నంటే ఎందుకు అస‌హ్యించుకుంటున్నాడో  వెంకిమామ స‌త‌మ‌త‌మ‌వుతాడు. వెంకిమామ అల్లుడు దూరం కావ‌డానికి కార‌ణం తెలుసుకునే ప్ర‌య‌త్నంలో అస‌లు నిజం బోధ ప‌డుతుంది. అల్లుడు కార్తీక్ దూరం కావ‌డానికి  కారణం తన తండ్రి (నాజర్) అని తెలుసుకొంటాడు. అసలు తనకు చాలా ఇష్టమైన వెంకిమామకు దూరంగా కార్తీక్ వెళ్లిపోవడానికి కారణం ఏమిటి… అందుకు నాజర్ ఎలా కారకుడయ్యాడు.. తన మేనల్లుడ్ని మళ్ళీ కలుసుకోవడం కోసం వెంకిమామ చేసిన ప్రయత్నాలు ఏమిటి.. అవి ఫ‌లించాయా.. లేవా..  అనేది తెర‌మీద చూడాల్సిందే.

నటీనటుల న‌ట‌నాతీరు:  వెంకిమామ‌ టైటిల్ కు విక్ట‌రీ వెంక‌టేశ్ పూర్తి న్యాయం చేశాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సెంటిమెంట్ సీన్స్, కామెడీ సీన్స్ ను వెంక‌టేశ్ క‌న్నా ఇంకా బాగా ఎవరూ చేయలేరని మ‌రోసారి నిరూపించారు. అల్లుడిగా నాగచైతన్య ప‌రిణితి మించిన న‌ట‌నా కౌశ‌ల్యంతో అద‌ర‌గొట్టి ఆకట్టుకొన్నాడు. రాశీఖన్నా కేవలం అందాల ప్రదర్శనకే పరిమితమవ్వకుండా నటనతో ఆకట్టుకొంది. నాగ‌చైత‌న్య‌తో రాశీఖ‌న్నా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక  పాయల్ రాజ్ పుత్ , వెంకటేశ్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. అలాగే వాళ్ళిద్దరి జోడీ మధ్య హిందీ కామెడీ జనాల్ని భలే నవ్విస్తుంది. ఈ రెండు జంట‌ల న‌డుమ జ‌రిగే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను కడుపుబ్బ న‌వ్విస్తాయి. ఇక ఈ సినిమాలో నాజర్, రావురమేష్, చమ్మక్ చంద్ర, విద్యుల్లేఖ రామన్, బ్రహ్మాజీ పాత్రలు త‌మ ప‌రిధి మేర‌కు న‌టించి ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు:  ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ వర్క్, సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. సంగీత ద‌ర్శ‌కుడు తమన్ సమకూర్చిన బాణీలు అలరిస్తాయి. నేపధ్య సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు తమన్. గ‌త చిత్రాల తాలుకూ సంగీతాన్ని ఎక్క‌డ రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు.   జాతకాలు, మానవీయ బంధాల నేపధ్యంలో ద‌ర్శ‌కుడు బాబీ,  కోన వెంకట్ లు ఓ మామూలు క‌థకు, మిలటరీ నేప‌థ్యాన్ని జోడించి  పెద్ద సాహస‌మే చేశారు. వెంకటేశ్ సినిమా నుండి ప్రేక్ష‌కులు కోరుకునేవాటిని అందించ‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంతం అయ్యారు.  సినిమాలో ఎక్క‌డా ఎబ్బెట్టు హాస్యం లేదు.. అంతా ఆరోగ్యకరమైన హాస్యం, మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఫైట్స్, సెంటిమెంట్ అన్నీ పుష్కలంగా ఉండెలా చూసుకున్నారు.  ఫస్టాఫ్ వరకు చాలా సరదాగా సాగిపోయిన కథ సెకండాఫ్ లో మాత్రం కాస్త నెమ్మదించింది.. అయినా ద‌ర్శ‌కుడు దాన్ని ఏమాత్రం క‌నిపించ‌కుండా త‌న‌దైన శైలీలో ముందుకు సాగించారు. మొత్తానికి ఈ సినిమా న‌టీన‌టుల చేత, టెక్నిషిన్స్ చేత ద‌ర్శ‌కుడు త‌న‌దైన పంథాలో ప‌నిని రాబట్టుకున్నారు. సినిమా ప్ర‌కృతిని, ప‌ల్లేటూరి వాతావార‌ణాన్ని, కుటుంబ సంబంధాల‌ను, అనుబంధాల‌ను తెలిపే చిత్రంగా నిలిచిపోయేలా తీర్చిదిద్దారు.

చివ‌రిగా : ఈ వెంకిమామ చిత్రాన్ని కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు బాబీ. కుటుంబంతో క‌లిసి చూసే చిత్రంగా ఫ్యామిలి పంథాలో బాగానే తీసాడు. ఇక వెంక‌టేశ్, నాగ‌చైత‌న్య మామా అల్లుండ్ల క్యారెక్ట‌ర్‌తో ఒదిగిపోయారు. చిత్రం చూసేందుకు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను ఎక్క‌డ విసిగించ‌కుండా, హాస్యం, డ్రామా, యాక్ష‌న్‌తో స‌మ‌పాళ్ళ‌లో రుచి చూపించారు. ఈ సినిమా గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఓ విందు భోజ‌నం వ‌డ్డించిన‌ట్లుగా ఉంది.

రేటింగ్: 3.0/5

Tags: NagaChaitanya, review, Tollywood, Venkatesh, VenkyMama