విక్టరీ వెంకటేశ్ ఉరఫ్ దగ్గుబాటి వెంకటేశ్. ఒకే రోజు డబుల్ ధమకా సాధించిన టాలీవుడ్ హీరో. ఈరోజు వెంకటేశ్ తాను నటించిన వెంకిమామ చిత్రం విడుదల అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నది. ఈ ఆనందంతో ఉప్పొంగిపోతున్న వెంకటేశ్ ఈ రోజు పుట్టిన రోజు కూడా జరుపుకుంటున్నారు. తాను పుట్టిన రోజున.. తన మేనల్లుడితో కలిసి నటించిన చిత్రం వెంకిమామ విజయవంతంగా ప్రదర్శించబడుతుండటంతో ఆనందానికి ఆవదుల్లేకుండా పోయిన వెంకిమామకు. అయితే వెంకి పుట్టిన రోజున టాలీవుడ్, ప్రేక్షకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో పుట్టిన రోజు, వెంకిమామ విజయోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వెంకటేశ్ 1960 డిసెంబర్ 13న ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు, రాజేశ్వరి దంపతులకు జన్మించాడు. వెంకటేశ్ కు అన్న ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు, చెల్లె లక్ష్మీ ఉన్నారు. అయితే ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామం వెంకటేశ్‌ది స్వగ్రామం. వెంకటేశ్ హైస్కూల్ వరకు మద్రాస్‌లోని ఎగ్మోర్ పట్టణంలోని డాన్‌బాస్కో పాఠశాలలో, లయోలా కాలేజ్‌లో వాణిజ్యంలో డిగ్రీని, అమెరికాలో మాంటెరీలోని మిడిల్బరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అయితే చిన్ననాడే 1971లోనే ప్రేమ్ నగర్ చిత్రంలో బాలనటుడిగా నటించిన అనుభవంతో అమెరికాలో ఉన్నత విద్య పూర్తికాగానే ఇండియాకు వచ్చి నటుడిగా మారిపోయారు.
1986లో కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తాను నటించిన మొదటి చిత్రంతోనే ఉత్తమ తొలి నటుడిగా నంది అవార్డు అందుకున్న హీరో వెంకటేశ్. తరువాత వెంకటేశ్ ఏనాడు కేరీర్ పరంగా వెనుదిరిగి చూడలేదు. ఈ 30ఏళ్ళ సిని కేరీర్‌లో వెంకటేశ్ 72 చలన చిత్రాలలో నటించారు. రెండు బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించారు. ఆయన ఏడు రాష్ట్ర నంది అవార్డులు,ఆరు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నాడు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విక్టరీ వెంకటేశ్‌కు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే విధంగా డైలీ ఆంధ్ర కూడా శుభాకాంక్షలు తెలుపుతుంది.