విజయవాడకు చెందిన ప్రముఖ రాజకీయ వారసుడు.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. రాధా వయస్సు దాదాపు నాలుగు పదులకు చేరువ అవుతోంది. ఇప్పటి వరకు కూడా ఆయన పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆయన పెళ్లి చేసుకోడు అని వస్తోన్న వార్తలకు ఎట్టకేలకు తెరపడినట్లయ్యింది. చాలామంది వంగవీటి రంగా అభిమానులు కూడా తమ రంగా గారి వారసుడు పెళ్లి చేసుకుని ఆ ఫ్యామిలీ వారసత్వాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ వస్తున్నారు.
ఎట్టకేలకు వీరి ఎదురు చూపులకు తెరపడనుంది. ఇక పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు పెళ్లి కుదిరింది. తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయితో ఈ వివాహం నిశ్చయం అయినట్లు తెలిసింది. ఈ నెల 19న నర్సాపురంలో ఎంగేజ్మెంట్.. అక్టోబర్లో పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. ఇక రాధా పెళ్లి చేసుకోరు అని బలంగా ఫిక్స్ అయిన వారంతా ఎట్టకేలకు ఈ పెళ్లి వార్త విని ఆశ్చర్యపోతున్నారు.
రాధా 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం 26 ఏళ్ల వయస్సులోనే ఓసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నా మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ఆ తర్వాత మరోరెండు సార్లు ప్రజారాజ్యం, వైసీపీ నుంచి అసెంబ్లీకి పోటీ పడినా కూడా ఓడిపోయారు. ఇక ఇప్పుడు రాధా టీడీపీలో ఉన్నా ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే టీడీపీ అధిష్టానం అక్కడ బొండా ఉమాకు సీటు ఇచ్చే ఆలోచనలో ఉంది.
ఏదేమైనా రాధా ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడంతో రంగా, రాధా అభిమానుల ఆనందానికి అవధులు అయితే లేవు. వంగవీటి ఫ్యామిలీ బలమైన వారసత్వాన్ని రాధా కంటిన్యూ చేయాలని ఆ ఫ్యామిలీ అభిమానులు కోరుకుంటున్నారు.