ఏపీ ప్ర‌భుత్వంపై ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చాలా కాలం త‌రువాత మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కారు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్ల అరుణ‌కుమార్‌. అప్ప‌ట్లో ఈనాడు అధినేత రామోజీరావుకు సంబంధించి మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్ సంస్థ‌కు సంబంధించిన అంశంలోనూ, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న స‌మ‌యంలోనూ ఆయ‌న పేరు ప్ర‌ముఖంగా విన‌డింది. రాష్ర్గాల విభ‌జ‌న త‌ర్వాత చాలా కాలం తెర‌మ‌రుగ‌య్యారు. అడ‌పాద‌డ‌పా కార్య‌క్ర‌మాల్లో క‌నిపించిన అందుకు సంబంధించిన అంశాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. ఇటీవ‌ల కాలం నుంచే మ‌ళ్లీ ఆయ‌న పేరు బైటికి విన‌వ‌స్తున్న‌ది. మొన్న‌టికి మొన్న మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్ కేసు అంశానికి సంబంధించిన కీల‌క‌వ్యాఖ్య‌ల‌ను చేసి వార్త‌ల్లో నిలిచారు. తాజాగా ఏకంగా ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌ర్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌ను చేశారు. అవి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఇంత‌కి ఆయ‌న ఏమ‌న్నారంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చాక‌క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో దిగ‌జారింద‌ని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆదాయం గ‌ణనీయంగా పడిపోయిందని.. కేంద్రం పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉందని, అక్క‌డి నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు కూడా రాని దుస్థితి నెల‌కొంద‌ని ఆయ‌న వివ‌రించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై మాజీ ప్రధాని మన్మోహన్ గతంలోనే హెచ్చరించారని..అప్ప‌డు ఎవరూ పట్టించుకోలేదని ఉండ‌వ‌ల్లి ఈ సంద‌ర్భంగా ఉటంకించారు. ఇక ఏపీ రాష్ట్ర పరిస్థితి భయంకరంగా ఉందని, బడ్జెట్ ప్రవేశపెట్టాక మరింత స్పష్టత వస్తుందని, దేవుడున్నాడని తరుచూ సీఎం జగన్ అంటుంటారని.. ఇప్పుడు ఆ దేవుడే ఆయన‌ను ఆశీర్వదించాలని ఆయ‌న అనడం ఆస‌క్తిక‌రంగా మారింది. ఏది ఎలా ఉన్నా బడ్జెట్‌లో పోలవరానికి తొలి ప్రాధాన్యమివ్వాలని ఆయ‌న కోర‌డం గ‌మ‌నార్హం. రాజశేఖర్ రెడ్డి కొడుకు ‘మాట తప్పడు.. మడమ తిప్పడు’ అన్న నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారని.. ఆ నమ్మకాన్ని జ‌గ‌న్ నిలబెట్టుకోవాలని ఉండ‌వ‌ల్లి సూచించ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. మ‌రి దీనిపై అధికార వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags: ap cm jagan mohanreddy, margadarshi, undavalli arunkumar