జనసేన అధినేత ఒకవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటున్నారు. ఇటీవలే అమరాతి రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించారు. స్థానిక రైతులతో మాట్లాడి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తాజాగా ఆయన నేడు (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించనున్న రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పీకే పాల్గొనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం.. తొలుత కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని పవన్‌కల్యాణ్ సందర్శించనున్నారు. గతంలో చేసిన హామీ మేరకు కేంద్రీయ సైనిక్ బోర్డుకు, అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి రూ.కోటి విరాళానికి సంబంధించిన చెక్కును సైనిక అధికారులకు అందజేయనున్నారు.
ఆ కార్యక్రమం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర మానవవనరుల శాఖ నిర్వహించే ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్‌కల్యాణ్ పాల్గొనున్నారు. ఈ ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సుకు మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్లో అధ్యక్షత వహించనుండగా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా హాజరుకానున్నారు. ఈ సదస్సులో దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించే అంశంపై పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. అంతేగాక జనసేనానిపై రూపొందించిన ఓ షార్ట్ ఫిలింను కూడా ప్రదర్శించనుండడం విశేషం. ఇదిలా ఉండగా.. పొత్తు కుదిరిసిన తర్వాత రెండోసారి హస్తినకు వెళ్తున్న ఆయన బీజేపీ నేతలను కలుస్తారా? ల లేదా? అని అసక్తికరంగా మారింది. ఈ విషయంపై పార్టీ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ఇరుపార్టీల పొత్తులపై కేంద్రంలోని పార్టీ నేతలు ఒకటి చెబుతుంటే.. రాష్ర్ట నేతలు మరొక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ టూర్‌లో బీజేపీ పెద్దలను ఒకవేళ పవన్ కలిస్తే రాష్ట్రంలోని కమలనాధుల మీద ఫిర్యాదు చేసే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతున్నది. ఏం జరగనుందో చూడాలి మరి.