తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత అంతటి క్రియాశీలక పాత్రను పోషించింది ప్రస్తుతం ఎవరన్నా ఉన్నారా అంటే ముందుగా ప్రెఫెసర్ కోదండరాం పేరును చెప్పుకోవాల్సిందే. ఆయన తెలంగాణ భావజాల వ్యాప్తికి ఊరూరా తిరుగుతూ మీటింగులు నిర్వహించారు. మేధావి వర్గాన్ని రాష్ర్ట సాధన ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకు సదస్సులు నిర్వహించారు. మిలియన్ మార్చ్.. సాగరహారం తదితర కార్యక్రమాల రూపకల్పనలో, వాటిని విజయవంతం చేయడంలో కీలక భూమికను నిర్వర్తించారు. రాష్ర్ట ఆవిర్భావం తర్వాత కూడా టీఆర్ ఎస్‌లో భాగస్వామికాకుండా ప్రజల పక్షాన ఉంటానని అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తారు. మరెక్కడ, ఎలాంటి చిక్కు వచ్చి పడిందో తెలియదు కాదని, అప్పటి వరకు కేసీఆర్‌తో ఉన్న సత్సంబంధాలు సైతం చెడిపోయాయి. ఈ నేపథ్యంలో ఉద్యమ నేతలను కలుపుకుని సొంతంగా తెలంగాణ జన సమితి పార్టీనే స్థాపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టి ఎన్నికల్లో పోటీ చేసి కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేక భంగపడ్డారు. నాటి నుంచి రాజకీయంగా ఎక్కడా కనిపించకుండా పోయారు.
ఇదిలా ఉండగా.. తాజాగా టీజేఏసీ మాజీ చైర్మన్, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ రాజకీయంగా కొత్త ఎత్తులు వేసేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరందుకున్నది. వచ్చే ఏడాది జరగబోయే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తున్నది. తెలంగాణలో టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసేందుకు నయా వ్యూహాన్ని రచించే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. అదీగాక ఢిల్లీ రాజకీయాల్లోకి సామాన్యుడిగా ప్రవేశించి అసామాన్య విజయాలతో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన అర్వించి కేజ్రీవాల్ బాటలో పయనించాలని భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పడిదే హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయావర్గాల్లో దీనిపై ఆసక్తికర చర్చ కొనసాగుతున్నది.
అయితే తెలంగాణలో ఇప్పటివరకు టీఆర్ఎస్‌నే లక్ష్యంగా చేసుకుని రాజకీయ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ మాజీ ప్రొఫెసర్ ముందుకు సాగారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడం అటుంచి ఉన్న ఇమేజ్‌ని సైతం కోల్పోయే దుస్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై తమ పంథా మార్చుకోవాలని కోదండరాం భావిస్తున్నట్లు తెలిసింది. టీఆర్ ఎస్‌ను కాకుండా, తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమీ చేస్తామో చెప్పి జనంలోకి వెళ్లాలని… అందుకోసం ఢిల్లీలోని కేజ్రీవాల్ చేసిన అభివృద్ధిని మోడల్ సరైందని, దానిని ఆసరాగా చేసుకుని ముందుకు సాగాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన అంశాలపై పార్టీ కేడర్‌కు క్లాసులు కూడా తీసుకుంటున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. అసలు క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణమే లేకుండా ఈ రకమైన ప్రయోగాలు అంతగా ఫలితాలు ఇవ్వవని సొంత పార్టీకి చెందిన పలువురు నేతలే బాహాటంగా విమర్శిస్తుండడం గమనార్హం. ఇప్పడి చర్చ ఆసక్తికరంగా మారింది. ఇప్పుడైనా కోదండరామ్ విజయవంతం అవుతారా? అని పలువరు రాజకీయ నేతలు విశ్లేష|ణలు చేస్తున్నారు.