టీడీపీలోకి ఇద్ద‌రు వైసీపీ ఎంపీలు… ఆ రెండు సీట్లు ఫిక్స్ చేసిన బాబు…?

ఏపీలో సాధారణ ఎన్నికల వేడి మొదలైంది. వైసిపి తో పాటు టిడిపి, జనసేన పార్టీలలో రాజకీయ సమీకరణలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో చాలామంది వైసీపీలోకి జంప్ చేశారు. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ముందు సీన్ రివర్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికార వైసీపీ నుంచి పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా టిడిపి వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కోస్తా జిల్లాలకు చెందిన ఇద్దరు ఎంపీల చూపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారు వైసీపీని వీడి టిడిపిలోకి వచ్చేందుకు చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఆ ఇద్దరు ఎంపీలు ఎవరో కాదు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. వీరిలో మాగుంట గత ఎన్నికలకు ముందు టిడిపి ఎమ్మెల్సీగా ఉన్నారు. 2014లో ఒంగోలు నుంచి టిడిపి ఎంపీగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిన ఆయన ఆ తర్వాత పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

గత ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకుని ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. ఇక లావు శ్రీకృష్ణదేవరాయుల కుటుంబానికి కొన్నేళ్ల‌ ముందు నుంచి తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలే ఉండేవి. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీకి రెడీ అయ్యారు. జగన్ చివర్లో నరసరావుపేట పంపడంతో అక్కడ నుంచి టీడీపీ సీనియర్ నేత రాయ‌పాటి సాంబశివరావును ఓడించారు. పేరుకు మాత్రమే లావు ఎంపీగా ఉన్న ఆయన పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ఆయనకు ఏమాత్రం సఖ్యత లేదు.

చివరకు అధిష్టానం కూడా లావుకు ఏమాత్రం ప్రయారిటీ ఇవ్వట్లేదు. జగన్ కూడా లావు చెప్పిన పనులు చేయటం లేదని.. లావు విషయంలో అంత ఇంట్రెస్ట్ గా లేరని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుర్తింపు విలువ లేని పార్టీలో ఉండటం కన్నా బయటికి రావటమే మంచిదని నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది. టిడిపిలోకి వచ్చేందుకు రెడీ అవుతున్న లావుకు గుంటూరు లోక్‌స‌భ సీటు టిడిపి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ అంత యాక్టివ్గా లేరు.

ఇటీవల లోకేష్ ఇవ్వడం పాదయాత్రలో కూడా ఆయన పాల్గొలేదు. ఈసారి ఆయన లోక్‌స‌భకు పోటీ చేయరని.. రాజకీయాల్లో కొనసాగాలని అనుకుంటే రాజ్యసభకు వెళతారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే లావు టిడిపిలోకి వస్తే ఆయనకు గుంటూరు లోక్సభ సీటు ఇచ్చేలా ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక మాగుంట పేరుకు మాత్రమే వైసీపీలో ఉన్నారే తప్ప ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆయనకు కూడా పార్టీ పరంగా ప్రభుత్వపరంగా పెద్ద గుర్తింపు లేదు.

 

ఒంగోలు రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి – వైవి సుబ్బారెడ్డి ఇద్దరికి మాత్రమే ప్రాధాన్యత ఉందన్నది వాస్తవం ఎంపీగా ఉన్న మాగుంటను అక్కడ పట్టించుకునే వారే లేరు. ఈ క్రమంలోనే ఆయన ఈసారి టిడిపి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. మాగుంట టిడిపిలోకి వస్తే ఆయనకు ఒంగోలు ఎంపీ సీటు లేదా మార్కాపురం అసెంబ్లీ బరిలో కూడా దింపే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీకి పెద్ద షాకులు తప్పేలా లేవు.