బుజ్జ‌గింపులు ఫెయిల్‌… కాంగ్రెస్‌లోకి ‘ తుమ్మ‌ల‌ ‘.. పోటీ ఎక్క‌డంటే…!

పాలేరు టికెట్ తనకే వస్తుందని భావించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు భంగపాటు తప్పలేదు. 2018 లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌కు వచ్చిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో తుమ్మల అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. అధిష్టానం తుమ్మలకు మొండి చేయి చూపడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న తుమ్మల అభిమానులు అందరూ కూడా ఆయన్ను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.

విలువ లేని చోట ఉండటం అనవసరం అని సీఎం కేసీఆర్ కు తమ సత్తా ఏంటో చూపాలని వారు భావిస్తున్నారు. మెజార్టీ నాయకులు అయితే తుమ్మలను కాంగ్రెస్ నుంచి బరిలో నిలవాలని ఒత్తిడి చేస్తున్నారు. అలా చేస్తే తెలుగుదేశం – సిపిఐ – సిపిఎం ఓట్లు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తుమ్మలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని టిఆర్ఎస్ పార్టీ పెద్దలు బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎంపీ నామా నాగేశ్వరరావు తో పాటు జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తుమ్మల ఇంటికి వెళ్లి చర్చలు జరిపినా.. తుమ్మల మాత్రం సీఎంతో మాట్లాడేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. తుమ్మల అభిమానులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు కార్య చరణ పై చర్చలు జరుపుతున్నారు. ఖచ్చితంగా ఈసారి తుమ్మల పోటీ చేయకపోతే ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి ఉంటుందని.. రాజకీయ భవిష్యత్తు కోసం అయినా తుమ్మల ఈసారి ఎన్నికలలో పోటీ చేసి సత్తా చాటాలని తుమ్మలతో వారు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

తుమ్మల రేపు జిల్లాకు వస్తుండడంతో భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుమ్మల వర్గం బలంగా ఉంది. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు తెలుగుదేశం.. ఆయన అభిమానుల ఓట్లతో జిల్లా వ్యాప్తంగా బలమైన ప్రభావం ఉంటుంది. అలాగే తుమ్మల పాలేరులో పోటీ చేస్తే ఇటు ఖమ్మం అటు కోదాడ, సూర్యపేట నియోజకవర్గాల్లో బలమైన ప్రభావం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.

మరో వైపు కాంగ్రెస్ నుంచి కూడా తుమ్మ‌లకు ఆఫర్లు వెళుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తుమ్మలకు పాలేరు లేదా ఖమ్మం అసెంబ్లీ సీట్లలో ఏదో ఒక సీటు ఇవ్వవచ్చని సమాచారం. మరి రాజకీయ సంకట స్థితిలో ఉన్న తుమ్మల కెసిఆర్ లైన్ లో ఉంటారా ? లేదా టిఆర్ఎస్ గీత దాటి బయటికి వస్తారా అన్నది త్వరలోనే తేలిపోనుంది.