`ఎన్నికలకు ఇంకా ఐదు మాసాల గడువు ఉంది. ప్రజల మధ్య ఉండండి. ప్రజలకు చేరువ అవ్వండి. వారి సమస్యలు విని.. మనం ఏం చేస్తున్నామో చెప్పండి. ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరిందో అంకెలతో సహా వివరించండి!“- ఇదీ సీఎం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు చెబుతున్న మాట. దీనిని ఎందరు తమకు అనుకూలమని భావిస్తున్నారో తెలియదు కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీకి వ్యతిరేకత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది డిపాజిట్లు దక్కించుకుంటే ఎక్కువని చెబుతున్నారు. ఈ క్రమంలో అనేక నియోజకవర్గాలు ముందు వరుసలో ఉన్నాయిని అంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ, అనంత జిల్లా తాడిపత్రి, అనంత అర్బన్, విజయవాడ సెంట్రల్, పశ్చిమ, నందిగామ, జగ్గయ్యపేట, గూడూరు, నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి(ఇక్కడ ఐదు సార్లుగా కాకాని గోవర్ధన్‌రెడ్డి గెలుస్తున్నారు. ఈ సారి ఓటమి ఖాయమనే చర్చ సాగుతోంది)లో ఎదురు గాలి వీస్తోంది.
ఇక, గుంటూరు జిల్లాలోని నరసరావుపేట(గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకత పెరిగింది), వినుకొండ(సొంత నేతలే వద్దు మహాప్రభో అంటున్నారు), తాడికొండ(ఉండవల్లి శ్రీదేవి రెబల్ అయ్యారు), వేమూరు(మంత్రి నాగార్జునకు సెగలు పొగలు), పోలవరం, పిఠాపురం, నంద్యాల, నగరి(మంత్రి రోజాకు సొంత గూటిలోనే వ్యతిరేకత), తాడేపల్లి గూడెం(మంత్రి కారుమూరికి వ్యతిరేకత పెరిగింది) ఇలా.. అనేక నియోజకవర్గాలు తెరమీదికి వస్తున్నాయి.
నిజానికి ఇవన్నీ కూడా.. టీడీపీతో ఏ పార్టీ పొత్తు లేనప్పుడు తలెత్తే ఓటమిగా వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. అదే రేపు టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తే.. ఈ రెండు పార్టీలకూ.. బీజేపీ కూడా తోడైతే.. అప్పుడు ఈ ఫలితం మరింత మారుతుందనే అంచనాలు వస్తున్నాయి. అప్పుడు ఖచ్చితంగా ఓడిపోయే నియోజవర్గాలు పెరుగుతాయని అంటున్నారు. త్రిముఖ పోటీ కాస్తా.. ద్విముఖ పోటీగా మారడం.. ప్రజలను నాయకులు దూరం చేసుకోవడం వంటివి వైసీపీలో ఓడిపోయే నియోజకవర్గాల సంఖ్యను పెంచుతున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.