టీడీపీ అధినేత చంద్రబాబుపై వరుస కేసులు.. పార్టీ నేతలపై దిగ్బంధాలు. పోలీసుల బల ప్రయోగాలు.. వెరసి కీలకమైన ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ దూకుడు జోరుగా ఉంది. ఈ పరిణామాలతో అంతర్గత సమస్యలను టీడీపీ జోరుగా ఎదుర్కొంటోంది. మరోవైపు.. చంద్రబాబును మరింత ఇరకాటం లోకి నెట్టేస్తూ.. కేసులపై కేసులు పెట్టేందుకు సీఐడీ కూడా పథకం ప్రకారం ముందుకు సాగుతున్నట్టు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పుడు అనూహ్యమైన పరిణామం తెరమీదికి వచ్చింది. సీఎం జగన్ పై ఉన్న 11 కేసుల విచారణ ఆలస్యమవుతోందని.. కోర్టు పరిదిని వేరే రాష్ట్రానికి మార్చాలని కోరుతూ.. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు కూడా విచారణకు తీసుకుని నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వైసీపీ కీలక నాయకుడు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ… సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ సంధించారు.
ఈ రెండు పరిణామాలు కూడా.. వైసీపీ అగ్రనాయకులకు కంటిపై కునుకులేకుండా చేస్తోందనే వాదన సొంత నేతల నుంచే వినిపిస్తోంది. “ఎలా నిద్రపడుతుంది? ఒకరు కోర్టును మార్చమన్నారు. మరొకరు బెయిల్ రద్దు చేయాలని అంటున్నారు. మీరు కూడా ఒకటి ఆలోచించాలి. మనమీద ఒత్తిడి పెరిగినప్పుడు సహజంగానే నిద్ర పట్టదు. మా నాయకులు కూడా అలానే బాధపడుతున్నారు“ అని ఓ కీలక మంత్రి ఆఫ్ ది రికార్డుగా మీడియాతో వ్యాఖ్యానించారు.
నిజమే.. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలో కి రావాలని ప్రయత్నాలుముమ్మరం చేస్తున్న సీఎం జగన్‌కు ఇప్పుడు వచ్చిన చిక్కులు ఇబ్బందిగానే పరిణమించాయని అంటున్నారు పరిశీలకులు. సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న లేఖను విచారణకు స్వీకరిస్తే.. అంతిమంగా వెంటనే సీఎం జగన్ కు కూడా ఈ విధానం చుట్టుకుంటుంది. ఇక, ఎన్నికల వేళ వేరే రాష్ట్రానికి ఈ కేసులు బదిలీ అయినా.. సీఎం జగన్‌కు ఇబ్బందే. ఈ పరిణామాలతో కునుకు లేకుండా పోయిందన్న వాదన నిజమే అయి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.