గర్భిణులు వ్యాయామంలో భాగంగా జాగింగ్ చేయడంపై చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. పరుగు వల్ల వారికి గర్భస్రావమయ్యే ముప్పు ఉంటుందని, నెలలు నిండక ముందే కాన్పు వచ్చే అవకాశాలు ఉంటాయని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే, ఇవన్నీ అపోహలేనని, తేలికపాటి పరుగు వల్ల గర్భిణులకు ఎలాంటి ముప్పు ఉండదని ఒక తాజా అధ్యయనంలో తేలింది.
గర్భిణులుగా ఉన్నప్పుడు జాగింగ్ చేసే మహిళలకు పుట్టే పిల్లల బరువులో కూడా ఎలాంటి లోపాలు తలెత్తవని ఈ అధ్యయనం చెబుతోంది. ప్రొఫెసర్ ఆండ్రూ షెనాన్ ఆధ్వర్యంలో లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో పరుగు వల్ల గర్భిణులకు ఎలాంటి హానీ జరగదని తేటతెల్లమైంది.
గర్భిణులు రోజూ కనీసం ముప్పయి నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిదని, వ్యాయామంలో భాగంగా ఒక మోస్తరు వేగంతో పరుగు తీయవచ్చని ఈ అధ్యయనం నిర్వహించిన కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాయామం వల్ల మహిళలు బరువు పెరగకుండా ఉంటారని, వారికి పుట్టే బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉంటారని వారు వివరిస్తున్నారు. అయితే ఈ పరుగు కేవలం కడుపుపై బరువు పడని విధంగా ఒక మోస్తరు వేగంతో (స్లో జాగింగ్) సాగితేనే మేలు.