కంచుకోట‌లో ‘ టీడీపీ శ్యామ్ ‘ విక్ట‌రీ ఈ సారి ప‌క్కానే…!

ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే వైసీపీ కంచుకోట అనే సంగతి తేలిసిందే. ఆ జిల్లాలో వైసీపీకి బలం ఎక్కువ. అయితే ఈ జిల్లాలో టి‌డి‌పికి బలమైన స్థానాలు కొన్ని ఉన్నాయి. కాకపోతే గత ఎన్నికల్లో ఆ స్థానాల్లో కూడా వైసీపీ సత్తా చాటింది. జిల్లాలో 14కి 14 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇప్పుడుప్పుడే సీన్ మారుతూ వస్తుంది. టి‌డి‌పి కొన్ని సీట్లలో బలం పుంజుకుంటుంది.

ఊహించని విధంగా కొన్ని సీట్లలో టి‌డి‌పి బలపడుతుంది. అలాంటి సీట్లలో పత్తికొండ ఒకటి. ఈ సీటు మొదట నుంచి టి‌డి‌పి కంచుకోట. 1985, 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో అక్కడ టి‌డి‌పి గెలిచింది. 2009 నుంచి ఇక్కడ కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ సత్తా చాటుతుంది. 2009లో కే‌ఈ ప్రభాకర్, 2014లో కే‌ఈ కృష్ణమూర్తి గెలిచి చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ సి‌ఎంగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో కే‌ఈ కృష్ణమూర్తి తన తనయుడు కే‌ఈ శ్యామ్‌ని బరిలో పెట్టారు.

అయితే అప్పటికే టి‌డి‌పిపై వ్యతిరేకత, ఇటు వైసీపీ అభ్యర్ధి శ్రీదేవికి సానుభూతి పెరిగింది. శ్రీదేవి భర్తని కొందరు దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో ఉండగా ఆ సంఘటన జరిగింది. తర్వాత శ్రీదేవి వైసీపీలోకి వచ్చారు. 2019లో వైసీపీ నుంచి అభ్యర్ధిగా నిలబడి దాదాపు 43 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఆమె గెలిచారు. కానీ ఎమ్మెల్యేగా శ్రీదేవి అనుకున్న మేర రాణించడం లేదని సర్వేలు చెబుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి పూర్తిగా శూన్యం.

ఆమె బంధువుల అక్రమాలు పెరిగిపోయాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఆమెకు వార‌సుల స్ట్రోక్ కూడా ఎక్కువే ఉందంటున్నారు. ఈ పరిణామాలు వైసీపీకి మైనస్ అవుతున్నాయి. అటు శ్యామ్ పాదయాత్ర ద్వారా ఇంటింటికి తిరుగుతూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. సర్వేలు కూడా శ్యామ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇంకాస్త కష్టపడితే ఈ సారి ఎన్నికల్లో పత్తికొండలో శ్యామ్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.