ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఎటు చూసిన ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మధ్యకు పార్టీ నాయ కులు వెళ్తున్నారు. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు కూడా.. నియోజకవర్గాల్లో నాయకులను ఖరారు చేస్తున్నారు. అంటే.. మొత్తంగా పార్టీలో ఒకవిధంగా దూకుడు పెరిగిందనే చెప్పాలి. ఒకవైపు పార్టీ నేతలను లైన్లో పెడుతూనే.. మరో వైపు చంద్రబాబు దొంగ ఓట్లు.. నకిలీ ఓట్లు విషయంపైనా ఆయన పోరాటం చేస్తున్నారు. దీనిని వదిలి పెట్టేది లేదని కూడా చెబుతున్నారు.
ఇదిలావుంటే.. యువ నాయకుడు నారా లోకేష్.. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ యాత్ర గుంటూరులో జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లోనూ పార్టీలో పునరుజ్జీవం కనిపించిందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక, ఈ యాత్రకు సంఘీభావంగా.. క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు బస్సు యాత్రలు చేస్తున్నారు. ఇవి చాపకింద నీరులా.. ప్రజల్లోకి బలంగా చేరుతున్నాయి. పెరిగిన ధరలు.. నాయకుల అవినీతి.. తదితర కీలక అంశాలపై వారు ప్రస్తావిస్తున్నారు.
ఇదిలావుంటే.. మరిన్ని కార్యక్రమాలకు చంద్రబాబు ప్రాణం పోస్తున్నారు. ప్రాజెక్టులపై పోరుబాట సలుపుతున్నారు. త్వరలోనే తాను పల్లెనిద్రకు రెడీ అవుతున్నానని తాజాగా వెల్లడించారు. ఇది పార్టీకి మరింత ఊపు తీసుకువస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. పల్లెనిద్ర చేయడం ద్వారా.. గ్రామీణ స్థాయిలో పార్టీని సంస్కరించడంతోపాటు.. గ్రామీణ ఓటు బ్యాంకును కూడా పదిలం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇక, యువతకు ప్రాధాన్యం ఇస్తూ.. త్వరలోనే `యువ కెరటం` పేరుతో యువతతో కూడా కార్యక్రమాలు చేయించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విధంగా జిల్లాల యాత్రలు కూడా చేయనున్నారు. అయితే.. దీనిని ఎన్నికలకు మూడు నెలల ముందు చేయాలని భావిస్తున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. టీడీపీ అమ్ముల పొదిలో అస్త్రాలు ఒకటి తర్వాత.. ఒకటి శరవేగంగా వస్తున్నాయని అంటున్నారు.