జాలి తలచి.. కన్నీరు తుడిచే దాతలే కనరాని ప్రస్తుత ప్రపంచంలో నేనున్నానంటూ.. ధైర్యం చెప్పగల నాయకుడిగా.. నేనున్నానంటూ ఆపదలో ముందుండి నిలిచేనాయకుడిగా మనసున్న ఎమ్మెల్యేగా.. మాన వత్వం చూపించే ఎమ్మెల్యేగా ముందున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి. వాస్తవానికి ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉంటారు. కానీ, మనసున్న ఎమ్మెల్యే, మానవత్వాన్ని చూపించగల ఎమ్మెల్యేలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు. వందలో ఒకరో ఇద్దరో..!
ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు ఉపేందర్‌రెడ్డి. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కందాల.. నియోజకవర్గం ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. వారికి ఏ ఆపద వచ్చినా ముందుకు వస్తున్నారు. కుల, మత, రాజకీయాలను ఎక్కడా చూడకుండా.. ఆపన్న హస్తం అందించడమే పరమావధిగా ఆయన ముందుకు సాగుతున్నారు. జ్యాతస్యహి మరణం ధ్రువం! పుట్టినవారు చనిపోక తప్పదు.
అయితే.. ఈ మరణం కొందరి కుంటుంబాలకు కోలుకోలేని వేదనను కలిగిస్తుంది. కుటుంబ పెద్ద చనిపో యినా.. సంపాయించే వ్యక్తి హఠాత్తుగా కాలం చేసినా.. ఆ కుటుంబం కోలుకోవడం అంత ఈజీకాదు. ఇక, బీద, బిక్కీ, దిగువ, మధ్య తరగతి పేదల ఇళ్లలో కనీసం మృతదేహానికి అంతిమ సంస్కారం చేసేందుకు కూడా తడుముకునే పరిస్థితి నెలకొంది. ఇలాంటి వారికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి నేనున్నానంటూ.. ఇంటి పెద్దగా ముందు నిలుస్తున్నారు.
తన నియోజకవర్గంలో ఎవరు మృతి చెందిన ఆ కుటుంబాన్ని రాజకీయాలకు అతీతంగా, కులాలు, మతాలకు అతీతంగా పరామర్శిస్తూ.. వారిని ఓదారుస్తూ.. ధైర్యం చెప్పడమే కాదు. ఆర్థికంగా అప్పటి కప్పుడు రూ.10 వేలు ఇచ్చి.. తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఈ సాయం అందించడంలో ఎమ్మెల్యే తనయ దీప్తి రెడ్డి, సతీమణి విజయారెడ్డిలు కూడా పాలుపంచుకుంటూ.. ఆవేదనలో నిండిన కుటుంబాలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. మృతిచెందిన వారి కుటుంబాలకు వారే స్వయంగా వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి సాయం అందిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఉపేందర్ రెడ్డి భార్య, కూతురు ఈ కార్యక్రమంలో నిర్విరామంగా పాల్గొన్నారు. వాళ్లకు కూడా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
గత మూడేళ్లుగా నియోజకవర్గంలో పార్టీలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఎవ్వరు చనిపోయినా కూడా రు. 10 వేలు ఆపన్నహస్తంగా సాయం చేయడంతో పాటు తర్వాత వారి కుటుంబం స్థితిగతులను బట్టి సాయం చేస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి రోజు 10 – 15 మంది వరకు రకరకాల కారణాలతో మృతిచెందుతూ ఉంటారు. ఈ మూడేళ్లలో ఆయన కోట్లాది రూపాయలను ఈ రూపంలో సాయం చేశారు.
ఉపేందర్‌రెడ్డి చేస్తున్న సాయం రాష్ట్రంలోనే మానవీయ కోణంలో బాగా హైలెట్ అయ్యింది. ఉపేందర్ మంచి మనకు, సాయం చేసే గుణం, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే లక్షణం బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను సైతం ముగ్ఢుణ్ణి చేశాయి. ఇక గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి హరీష్‌రావు సైతం రాష్ట్రంలో ఇలాంటి మంచి పని చేస్తోన్న ఎమ్మెల్యే ఎవ్వరూ లేరు.. వెరీ గుడ్ అంటూ కితాబిచ్చారు. ఏదేమైనా పాలేరులో ఈ ఇమేజ్ కందాళను పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా హీరోగా నిలబెట్టింది.