ప‌వ‌న్ – టీడీపీ ఇద్ద‌రూ ఈ విష‌యంలో జ‌గ‌న్‌కు పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే..!

టిడిపి – జనసేన దోస్తీ నిన్నటి వరకు ముసుగులో గుద్దులాట మాదిరిగానే సాగింది. అయితే ఇప్పుడు జగన్ రెడ్డి చేసిన పుణ్యమా అని ఇది పూర్తిగా ఓపెన్ అయిపోయింది. చంద్రబాబు అరెస్టును ఖండించిన పవన్ కళ్యాణ్ తాను ముమ్మాటికి చంద్రబాబు వెనకే ఉంటానని స్పష్టం చేయడంతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఖ‌రారు అయిపోయింది. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే పవన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగి తన మద్దతు ప్రకటించడం టిడిపి వర్గాల మనసులను కూడా గెలుచుకున్న‌ట్ల‌య్యింది.

పవన్ – చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చేందుకు బయలుదేరారు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చివరకు పవన్ రోడ్డు మార్గాన విజయవాడ వచ్చేందుకు ప్రయత్నించినా ఏపీ పోలీసుల నుంచి ఎన్నో అవంతరాలు ఎదురయ్యాయి. చివరకు నిన్న లోకేష్, బాలకృష్ణతో కలిసి చంద్రబాబుతో ములాఖ‌త్‌ అయిన వెంటనే పవన్ పొత్తుపై ముసుగులో గుద్దులాట లేకుండా ఓపెన్ గా చెప్పేశారు.

ఇక వచ్చే ఎన్నికలలో వైసిపి పై పోరాటం చేసేందుకు చంద్రబాబు – పవన్ కలిసి వెళుతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. లోకేష్ సైతం నా వెంట ఉన్నాడు అని చెప్పటం పొత్తుకు మరింత బలాన్ని తీసుకొచ్చినట్లు అయింది. ఇక ఇప్పుడు తెలుగుదేశం కేడర్ అంతా పవన్ కళ్యాణ్ పై అపారమైన ప్రేమ కురిపిస్తుంది. ఇటు జనసేన కేడర్ కూడా చంద్రబాబు టీడీపీకి వెన్ను దన్నుగా నిలుస్తుంది. తెలుగుదేశం కేడర్ అంతా కష్టకాలంలో అండగా నిలబడే వాడే నిజమైన స్నేహితుడు అంటూ పవన్ ని భుజానికి ఎత్తేస్తున్నాయి.

ఏదేమైనా జగన్ చంద్రబాబును అరెస్టు చేసి తెలుగుదేశం – జనసేన సాన్నిహిత్యాన్ని మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేశాడు. ఈ విషయంలో అటు జనసేన కేడర్.. తెలుగుదేశం క్యాడర్ మరింత క‌సితో పనిచేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంలో వీళ్లంతా జగన్కు నిజంగా థాంక్స్ చెప్పుకోవాల్సిందే.