క‌డ‌ప‌లో టీడీపీ 5 సీట్ల‌లో గెలుస్తుందా… నిజంగానే అంత సీన్ ఉందా.. ఆ సీట్లు ఏంటి…!

చంద్రబాబు గత 25 సంవత్సరాలలో ఎన్నిసార్లు గెలిచి ముఖ్యమంత్రి అయినా… ఎన్నిసార్లు ఓడిపోయి.. ప్రతిపక్షంలో ఉన్న.. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో మాత్రం టచ్ చేసే పరిస్థితి లేదు. గత 20 సంవత్సరాలలో చూస్తే తెలుగుదేశం కడప జిల్లాలో ఏమాత్రం గ్రాఫ్ పెంచుకోవడం లేదు. చంద్రబాబు కూడా గుంటూరు, కృష్ణ, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చిన సీట్లతో అధికారం చేపట్టడమే తప్ప.. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా జగన్ సొంత జిల్లాలో బలం పెంచుకోవాలన్న ఆలోచన చేయటం లేదు.

చంద్రబాబు చేసిన ఈ పెద్ద తప్పుకే కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలైపోయింది. అదే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుతో పాటు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న ఉత్తరాంధ్ర, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీని ఎలా ? బలహీనం చేయాలన్న దానిపై రకరకాల ఎత్తులు వేస్తూ వస్తున్నారు. చంద్రబాబు కడప జిల్లాపై ఏ స్ట్రాటజీ అమలు చేయకపోవడంతోనే పార్టీ అక్కడ పూర్తిగా వీక్ అయిపోయింది.

2004లో కమలాపురం సీటుతో సరిపెట్టుకున్నారు. టిడిపి 2009 ఎన్నికల్లో ఒక ప్రొద్దుటూరులో మాత్రమే విజయం సాధించింది. అది కూడా అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత వరదరాజుల రెడ్డికి వైయస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న విభేదాల వల్లే ఆ సీటులో ఆయన ఓడిపోయారని అంటారు. ఇక 2014లో రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా కడప జిల్లాలో టిడిపి ఘోరంగా చతికిల‌ పడింది. కడప – రాజంపేట ఎంపీ సీట్లతో పాటు ఒక్క రాజంపేట అసెంబ్లీ మినహా అన్ని సీట్లలోను ఘోరంగా ఓడిపోయింది.

AP minister Adi Narayana Reddy Ready To Contest As MP

రాజంపేట నుంచి మేడా మల్లికార్జున్ రెడ్డి మాత్రమే విజయం సాధించారు. ఇక గత ఎన్నికలకు ముందు ఆయన కూడా వైసిపిలోకి జంప్ చేసేసారు. గత ఎన్నికల్లో అయితే కడప జిల్లాలో టిడిపి రెండు ఎంపీ సీట్లు 10 అసెంబ్లీ సీట్లలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అంటే గత 25 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఎంత దారుణ పరిస్థితుల్లో ఉందో ఈ లెక్కలే చెబుతున్నాయి. అలాంటి కడప జిల్లాలో ఇప్పుడు రకరకాల సమీకరణలు రకరకాల కారణాలతో తెలుగుదేశం పార్టీకి కాస్త సానుకూల వాతావరణం కనిపిస్తుంది.

ఇప్పుడున్న లెక్కలతో పాటు తల‌పండిన రాజకీయ మేధావులు చెపుతున్న దాని ప్రకారం.. జిల్లాలో తెలుగుదేశం కచ్చితంగా నాలుగు నుంచి ఐదు సీట్లలో పాగా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో టిడిపి బలంగా కనిపిస్తోంది. ప్రొద్దుటూరులో ఉక్కు ప్రవీణ్ రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చాక అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా పుంజుకుంది.

వైసీపీ వైపు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే: ఇక ఆ జిల్లాలో టీడీపీ గడ్డు  పరిస్థితులు.! | TDP Ex MLA Veera Shiva Reddy is all set to join in ruling  YSR Congress Party - Telugu Oneindia

దీనికి తోడు స్థానిక వైసిపి ఎమ్మెల్యే వరుసగా రెండుసార్లు విజయం సాధించడంతో పాటు అక్కడ ఎమ్మెల్సీతో ఉన్న వైరుధ్యం టిడిపికి కలిసి వస్తోంది. ఇక తెలుగుదేశం ముందు నుంచి బలంగా ఉండి రకరకాల కారణాలతో ఓడిపోతున్న రాజంపేట – రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో పార్టీకి సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. అలాగే కమలాపురం నియోజకవర్గంలో సీఎం జగన్ కు మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి పై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అక్కడ నుంచి వీరశివారెడ్డి టిడిపి తరఫున పోటీలో ఉంటే కచ్చితంగా కమలాపురం సీటు సైకిల్ ఖాతాలో పడుతుందని అంటున్నారు. ఇక మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ మున్సిపాలిటీని దాదాపు గెలిపించినంత పని చేశారు. ఈసారి అక్కడ సీనియర్ నేత వైసీపీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పోటీ చేయరని తెలుస్తోంది.

అక్కడ కొత్త నేతకు సీటు ఇస్తే ఈసారి సుధాకర్ యాదవ్ తొలిసారి అసెంబ్లీ గడప తొక్కటం ఖాయమని అంటున్నారు. అలాగే ఆదినారాయణ రెడ్డి టిడిపిలోకి వస్తే.. ఆయనకు మరో సీటు సర్దుబాటు చేస్తే జమ్మలమడుగులో ఆయన వర్గం కూడా పార్టీకి బలంగా పనిచేస్తే.. ఈసారి కూడా అక్కడ హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఏదేమైనా జగన్ కు సొంత అడ్డ అయినా కడప జిల్లాలోనే ఫ్యాన్ రెక్కలు విరుగుతున్న పరిస్థితి వాస్తవ దర్పణానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే వచ్చే ఎన్నికలకు ముందు వైసిపి మరింత దిగజారటం కాయంగా కనిపిస్తోంది.

Tags: ap politics, latest updates, political news, political updates, politics, polititions, social media, tdp, tdp political news, telugu news, viral news