ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం పేరు చెపితే తెలుగుదేశంకు కంచుకోట. అందులోనూ కామవరపుకోట మండలంలో 2001లో కాంగ్రెస్, 2021 ఎన్నికల్లో మినహా ఎప్పుడూ మండలంలో టీడీపీ ఓడిపోలేదు. 2021 ఎన్నికలను పార్టీ రాష్ట్ర వ్యాప్తంగానే పార్టీ బహిష్కరించింది. 2001లో మాత్రం అప్పుడు ( తదనంతర కాలంలో 2004లో చింతలపూడిలో ఎమ్మెల్యేగా గెలిచిన ) ఘంటా మురళీ ప్రభంజనం వీయడంతో టీడీపీ ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లోనే మురళీ నాటి టీడీపీ ప్రభుత్వ బలమైన గాలులు తట్టుకుని 4500 ఓట్ల మెజార్టీతో జడ్పీటీసీ గెలిచి.. అసెంబ్లీకి మార్గం పరుచుకున్నారు.
2014లోనూ టీడీపీ మండలంలో బంపర్ విక్టరీ కొట్టింది. జడ్పీటీసీని భారీ మెజార్టీతో గెలుచుకోవడంతో పాటు రెండు, మూడు ఎంపీటీసీ స్థానాలు మినహా అన్ని చోట్లా గెలిచింది. ఇక 2019 సాధారణ ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ టీడీపీలోకి జంప్ చేశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పార్టీ గ్రూపులుగా చీలిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే గ్రూపులు పోటీ పడినా సులువుగా గెలవాల్సిన స్థితిలో కూడా పార్టీ ఓడిపోయింది. ఇందుకు ప్రధాన కారణం పార్టీలో పాత, కొత్త నేతలు కలసి పనిచేయకపోవడమే..!
అయితే పంచాయతీ, స్థానిక ఎన్నికల్లో ఘంటా మురళీ వర్గ ప్రభావం కొన్ని చోట్ల పనిచేయడంతోనే తెలుగుదేశం పార్టీ కనీసం కొన్ని పంచాయతీల్లో అయినా విజయం సాధించింది. ఇక సాధారణ ఎన్నికల వేడి ప్రారంభమైంది. పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నా పార్టీ నేతలు అందరూ కలిసి చేస్తోన్న ప్రోగ్రామ్ ఒక్కటి కూడా లేదు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మినీ మహానాడు అట్టహాసంగా జరిగింది. ఇక పార్టీ జిల్లా అధ్యక్షుడికి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారే తప్పా పార్టీలో కలిసి పనిచేసుకునే పరిస్థితి లేదు. చివరకు ఫ్లెక్సీల్లో కూడా ఒక వర్గం వారు.. మరో వర్గం నేతల ఫొటోలు వేయట్లేదు. ఇది పార్టీ కేడర్, ఓటర్లుకు ఎలాంటి సంకేతాలు పంపుతుందన్న ఆలోచన కూడా నేతలకు లేదు.
ఘంటా మురళీతో పాటు మాజీ జడ్పీటీసీ ఘంటా సుధీర్‌బాబు, మరో నేత ఘంటా మాధవరావు మాత్రం ప్రస్తుతానికి కలిసే కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. మురళీ ఇటు మండల పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గ స్థాయిలో తన పాతకేడర్‌ను కలుపుతూ తన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ ముద్ర అయితే పార్టీలో లేదు.
ఇక పార్టీలో ఆవిర్భావం నుంచి పెద్ద తరహా పాత్ర పోషిస్తోన్న మాజీ ఏఎంసీ చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన మాజీ ఉపసర్పంచ్ నెక్కలపు సూర్యనారాయణ, పార్టీకి సుధీర్ఘకాలం గ్రామ పార్టీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన నూతి రాటాలుతో పాటు పార్టీకి దూరంగా ఉంటోన్న కొందరు బీసీ, ఎస్సీ నేతలు, ఇతర వర్గాలు కూడా సమన్వయం కావాల్సి ఉంది.
నియోజకవర్గం మొత్తం మీద కామవరపుకోట, జంగారెడ్డిగూడెంలోనే పార్టీ కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. పైగా ఈ రెండు మండలాల నేతలు కలిసి పనిచేయడం కూడా బాగుంది. ఈ టైంలో కీలకమైన కామవరపుకోటలో కూడా గ్రూపుల గోల లేకుండా ఉంటే పార్టీకి అది చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. కానీ పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోతే అది పార్టీకి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంది. మరి నేతలు ఇకనైనా గొడవలు పక్కన పెట్టి, వ్యక్తిగత క్రెడిట్ గేమ్ పక్కన పెట్టి చేతులు కలుపుతారో ? లేదో ? చూడాలి.