వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలుపు గుర్రం ఎక్కాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తెలుగు దేశం పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఇదే విషయాన్ని తాజాగా ఆయన రుజువు చేసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం పూతలపట్టుకు అభ్యర్థిని ప్రకటించారు. రాజకీయాల్లోకి ఫస్ట్ టైం వచ్చిన హెచ్ ఎంటీవీ జర్నలిస్టు.. మురళీమోహన్‌కు ఆయన టికెట్ ఇస్తామని చెప్పారు.
ప్రజల మనిషిగా మురళీ మోహన్ ను గుర్తించాలని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓట్లు వేసి గెలిపించాలని చంద్రబాబు విన్నవించారు. ఇదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రజలకు ఆయన ఏమీ ఇవ్వలేడని. ప్రజలే ఆయనకు ఎదురు డబ్బులు ఇచ్చి సహకరించాలని కూడా చంద్రబాబు అన్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఎన్నికలకు 8-9 నెలల గడవు ఉండడం.. సరైన సమయంలో అభ్యర్థిని ప్రకటించడం మంచి పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం పూతలపట్టు ఎమ్మెల్యేగా ఎం.ఎస్ బాబు ఉన్నారు. వైసీపీ తరఫున గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. 26 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఆయన గెలుపు గుర్రాన్ని ఎక్కారు. ఇక, 2014లోనూ వైసీపీనే గెలిచింది. అభ్యర్థి మారినా.. విజయం సొంతం చేసుకుంది. దీనికి ముందు 2009లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంది. సో.. మొత్తానికి ఇది వైసీపీకి అడ్డా అనే చెప్పాలి.
సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా.. వైసీపీకి బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు 8-9 నెలల ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం.. ఇక్కడ కలిసి వచ్చే పరిణామంగా చెబుతున్నారు. పైగా మీడియా కు చెందిన వ్యక్తి కావడంతో అటు వైపు నుంచి కూడా అండ ఉంటుందని తెలుస్తోంది. స్థానిక టీడీపీ నాయకులు కూడా.. కలిసి వచ్చి.. మురళీ మోహన్‌కు అండగా నిలిస్తే.. పూతలపట్టులో టీడీపీ రికార్డు సృష్టించడం ఖాయమనే చర్చ సాగుతోంది.