ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండలో రాజకీయ కాక మరింత పెరిగింది. తాజాగా టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సూపర్ సక్సెస్ కావడంతో టీడీపీ నాయకుల్లో హుషారు వెయ్యి రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి కార్యకర్తా.. సమరోత్సాహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు జీవీ ఆంజనేయులు.. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై అదిరిపోయే పంచ్‌లు, సెటైర్లతో విరుచుకు పడుతున్నారు.
ఈ పంచ్‌లు బాగా పేలుతున్నాయ్.. సాధారణ జనాలకు కూడా బాగా కనెక్ట్ అవుతున్నాయ్..! 2019లో ఏం జరిగిందో మరిచిపోయావా బొల్లా అంటూ అదిరిపోయే పంచ్‌లో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నిక ల్లో 40 వేల ఓట్ల మెజారిటీతో తాను గెలుస్తున్నానని… దీనిని అడ్డుకోవడ బొల్లా వల్ల కూడా కాదని పేర్కొన్నా రు. గత ఎన్నికల్లో టీడీపీ నేతల చేతులు పట్టుకుని మరీ ఓట్లు అడుక్కున్న విషయం మరిచిపోయావా? అంటూ జీవీ విమర్శలు గుప్పించారు. గెలిచిన తర్వాత.. టీడీపీ పంచన చేరుతానని చెప్పిన మాట గుర్తులేదా.. అని నిలదీశారు.
“బొల్లా.. నీపై చంద్రబాబు పోటీ చేయాల్నా.. నారా లోకేష్ గారు పోటీ చేయాల్నా. నీ బతుక్కి వాళ్లు కావాలా.? వచ్చే ఎన్నికల్లో నిన్ను తరమి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. 40 వేల మెజారిటీతో నేను గెలుస్తా. నీమీద ఓ సామాన్య కార్యకర్తను పోటీకి పెట్టినా చిత్తుగా ఓడిస్తానని జీవి పంచ్‌లు పేల్చారు. ఇప్పుడు కాదు.. వచ్చే రోజుల్లో నీకు నియోజకవర్గం ప్రజలు సినిమా.. కలర్ సినిమా .. చూపించేందుకు రెడీగా ఉన్నారు. సిద్ధంగా ఉండు“ అని జీవీ నిప్పులు చెరిగారు. శాసన సభ్యుడిగా గెలిచిన తర్వాత.. ఆయనకు కళ్లు నెత్తికెక్కాయని వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ముందు అయ్యా బాబు.. అని బ్రతిమాలుకున్న బ్రహ్మనాయుడు.. ఇప్పుడు ప్రజలను కూడా మరిచిపోయారని విమర్శించారు. దోపిడీ విధానానికి, అక్రమాలకు.. వార్డు మెంబరుగా కూడా గెలిచే పరిస్థితి లేదని అన్నారు. వినుకొండలో కౌన్సెలర్‌గా పోటీ చేస్తేనే నువ్వు గెలవలేవని ఎద్దేవా చేశారు. నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 9 నెలలు ఆగితే.. ప్రజలు కలర్ సినిమా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారని, చూసేందుకు సిద్ధం కావాలని వ్యాఖ్యానించారు.