ఉత్తరాంధ్ర టీడీపీలో మహిళా నాయకులు మంచి జోరుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు రెండు కీలక స్థానాలకు దాదాపు ప్రకటన చేసినట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు స్థానాల్లోనూ ఈ సారి ఈ మహిళా ఎమ్మెల్యేల విజయం తథ్యమని చెబుతున్నారు సీనియర్లు. వీటిలో ఒకటి శ్రీకాకుళం జిల్లా పలాస. రెండోది విశాఖజిల్లాలోని పాయకరావుపేట. ఈ రెండు చోట్లా ఈ సారి టీడీపీ సైకిల్ జోరుగా ముందుకు సాగుతుందని అంటున్నారు.
పాయరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి వంగల పూడి అనిత మరోసారి పోటీకి రెడీ అయ్యారు. ఇక్కడ 2014లో ఆమె విజయం దక్కించుకున్నారు. 2019లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన దరిమిలా.. తిరిగి స్వస్థానానికి చేరుకుని.. పార్టీ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరినీ కలుస్తున్నారు. ఇటు పార్టీ కార్యక్రమాలు, అటు ప్రజా ఉద్యమాలను కూడా సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్నారు.
అదేసమయంలో పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు కంట్లో నలుసుగా మారి.. ఆయనకు షాకులపై షాకులు ఇస్తున్నారు. మరోవైపు.. వైసీపీలోనే గొల్లకు వ్యతిరేక వర్గం తెరమీదికి వస్తోంది. ఆయన నిమిత్త మాత్రుడేనని.. నాలుగేళ్లలో తమకు ఏమీ చేయలేక పోయారని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అనిత కు సానుభూతి పెరుగుతుండడం గమనార్హం. అదేసమయంలో పలాస నియోజకవర్గంలోనూ టీడీపీ గెలుపును రాసిపెట్టుకోవచ్చని చెబుతున్నారు.
పలాస నియోజకవర్గంలో మహిళా నాయకురాలు.. గౌతు శిరీష నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు తోడు సొంత అజెండాను ఏర్పాటు చేసుకుని సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి సీదిరి అప్పలరాజు వ్యతిరేక వర్గానికి కూడా ఆమెపై సానుభూతి పెరిగేలా చేసుకున్నారు. ఇక, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వచ్చిన సానుకూల వాతావరణం.. గౌతుకు కలిసి వచ్చేలా ఉందని అంచనాలు వస్తున్నాయి. మొత్తంగా ఉత్తరాంధ్రలో ఈ ఇద్దరు మహిళల గెలుపు ఖాయమని అంటున్నారు పరిశీలకులు.