రాజకీయాల్లో సొంత బలం మాట ఎలా ఉన్నా.. ప్రత్యర్థుల బలహీనత చాలా సమయాల్లో నాయకులకు కలిసి వస్తుంది. ఇలాంటి పరిస్థితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బాగా కలిసి వస్తోందని అంటు న్నారు పరిశీలకులు. ఇలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయని కూడా లెక్కలు వేస్తున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలోని రాజంపేట, ఉమ్మడి కృష్ణాలోని గన్నవరం, మచిలీపట్నం, నందిగామ, ఉమ్మడి గుంటూరులోని బాపట్ల, చిలకలూరి పేట, ప్రత్తిపాడు, తాడికొండ ఉన్నాయి.
అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి, కోడూరు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పలాస.. అదేవిధం గా పాతపట్నం వంటి నియోజకవర్గాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గాల్లో చాలా వరకు టీడీపీకి కంచుకోటలే. అయితే.. గత ఎన్నికలకు ముందు.. నుంచి వైసీపీ పాగా వేసింది. గత ఎన్ని కల్లో విజయం దక్కించుకుంది. ఒకటి రెండు నియోజకవర్గాల్లో అయితే.. వైసీపీ వరుస విజయాలు కూడా దక్కించుకుంది.
అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు.. ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలు పట్టించుకోని వైనం.. కేడర్‌ను దూరం పెట్టడం.. వంటివి వైసీపీపై ప్రభావం చూపిస్తున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున కొత్తవారికి టికెట్ ఇస్తే.. ఎంతో ఒకింత పోటీ ఉంటుందని చెబుతున్నారు.
అలా కాకుండా.. ఇప్పుడున్నవారికే టికెట్లు ఇస్తే.. ఖచ్చితంగా పెద్ద పోటీ కూడా లేకుండా.. ప్రతిపక్షం టీడీ పీ విజయం దక్కించుకోవడం ఖాయమని చెబుతున్నారు పరిశీలకులు. పైగా వైసీపీలో ఎన్నికలకు ముందు అంతర్గత కలహాలు పెరిగిపోతున్నాయని..అ దేసమయంలో టీడీపీలో గెలిచి తీరాలనే కసి.. అధికారంలోకి రావాలనే పట్టుదల పెరుగుతున్నాయని.. ఫలితంగా టీడీపీ గెలుపు తథ్యమని.. దీనికి వైసీపీలో ఉన్న విభేదాలు తమకు కలిసివస్తున్నాయని చెబుతున్నారు.