అధికారం పోవడమేమో గాని ఏపీలో విపక్ష టీడీపీకి గడ్డుకాలం మొదలైంది. ఆ పార్టీని రాజకీయంగా అణగదొక్కేందుకో? మరి పాత కక్షను తీర్చుకునేందుకో తెలియదు కానీ అధికార వైసీపీ మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం, సీఆర్డీఏ చట్టం రద్దు విషయంలో టీడీపీకి భారీ ఝలక్ ఇచ్చింది. ఏకంగా శాసనమండలిని రద్దు చేసింది. మరోవైపు శాసనమండలి చైర్మన్ పంపిన ఫైలును మండలి కార్యాలయం తిప్పి పంపింది. సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేయబోమని టీడీపీకి షాక్ ఇచ్చింది. అంతేగాక రాజధాని భూముల విషయంలో ఇద్దరు మంత్రులపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. వాటి నుంచి తేరుకోకముందే వరుసగా అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేతతో సన్నితంగా ఉన్న వారిపై ఐటీ, ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఐబీ చీఫ్ వెంకటేశ్వర్‌రావుపై సస్పెన్షన్ వేటు వేసింది. అన్నింటికన్న ముఖ్యంగా ఏళ్లుగా స్టేలతో మరుగునపడిన కేసులన్నీ ఇప్పడు తెరమీదకు వస్తున్నాయి. ఇంటా బయటా సమస్యలతో టీడీపీ అధినేత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
మరోవైపు టీడీపీలో కీలకంగా ఉన్న పలువురు నేతలపై వైసీపీ గట్టిగానే దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డికి సంబంధించిన ట్రావెల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నది. ఇప్పటికే పలు కేసులను నమోదు చేసింది. ఇప్పుడు తాజాగా టీడీపీ నేతలకు, మాజీ ప్రజాప్రతినిధులకు భద్రతను కుదించేసింది. చాలా మందికి పూర్తిగా భద్రతను ఉపసంహరించుకుంది. రాష్ర్ట సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు , పలువురు కీలక నేతలకు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది. వారిలో పల్లె రఘునాథరెడ్డి, జేసీ దివకర్‌రెడ్డి, కల్వ శ్రీనివాసులు, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు ఉన్నారు. టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్ భద్రతను సైతం కుదించింది. దీంతో తెలుగు తమ్ముళ్లలో ఆందోళన నెలకొన్నది.
ఇదిలా ఉండగా దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమను ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకే భద్రతను కుదిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఇది సరైన చర్య కాదని హితవుపలుకుతున్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమకు భద్రతను కల్పించిందని గుర్తుచేస్తున్నారు. కానీ అధికారంలోకి రాగానే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని సీఎం జగనపై నిప్పులు చెరుగుతున్నారు.