ప్రయాణికులపై రైల్వేశాఖ చార్జీల బాదుడు

ఇండియన్‌ రైల్వేశాఖ ఎడాపెడా చార్జిలను పెంచేస్తూ ప్రయాణికులపై ఎనలేని భారాన్ని మోపుతున్నది. ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. మొన్నటికిమొన్న సాధారణ రైళ్లలో ప్రయాణంపై కిలో మీటరుకు రూ.20 పైసల చొప్పున చార్జీలను పెంచింది. తాజాగా ఫ్లాట్‌ చార్జీలను సైతం పెంచింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రైల్వేస్టేషన్లలో ఏటా ప్రయాణికుల రద్దీ విపరీతంగా నెలకొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్ల సర్వీసులను కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసిన రూట్లలో నడుపుతుంది. ఈ సారి కూడా ఆయా రూట్లలో ప్రత్యేకరైళ్లను నడుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు ప్రయాణికులపై అంతేస్థాయిలో భారాన్ని మోపుతున్నది ఆ శాఖ. ఇటీవలె ప్రయాణ టిక్కెట్టు ధరలను పెంచిన ప్రభుత్వం తాజాగా ఫ్లాట్‌ఫారాల టిక్కెట్లను సైతం పెంచడం గమనార్హం.  అదీ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికేనని వెల్లడించడం కొసమెరుపు. పెంచిన చార్జీలు సైతం కాచిగూడ, సికింద్రబాద్‌ రైల్వేస్టేషన్లకే పరిమితం చేస్తూ.. అదీ పండగ సీజన్‌ పూర్తయ్యేవరకే వర్తింపజేయనున్నది. దీంతో ప్రస్తుతం ఆయా స్టేషన్లలో ఫ్టాట్‌ఫాం టిక్కెట్టు ధర ప్రస్తుతం రూ. 10 ఉండగా, దానిని రూ. 20కు దక్షిణమధ్య రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  వృద్ధులు, ఆడవాళ్లు.. పిల్లలు ఒంటరిగా ప్రయాణం చేయలేరని, ఎవరో ఒకరు వారిని స్టేషన్‌లో రైలు ఎక్కించాల్సి ఉంటుందని తెలిసీ ఆ శాఖ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం సరికాదని పలువురు ప్రయాణికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.