ఆమె పిల్లల తల్లి.. అతను 19 ఏళ్ల యువకుడు

ఆమెకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలం నుంచి భర్తకు దూరంగా ఉంటూ నివసిస్తున్నది. ఫేస్‌బుక్‌ ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 19ఏళ్ల యువకుడు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. ఒక్కసారిగా కనపించకుండా మాయమయ్యాడు. దీంతో సదరు వివాహిత పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నాచారం ఠాణా పరిధిలోని ఓ మహిళకే కొన్నేళ్ల క్రితమే వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

 

 

ఇటీవల కాలం నుంచి ఆమెను భర్త తీవ్ర చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. మానసికంగా వేధిస్తున్నాడు. భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పును.. పెడుతున్న చిత్రహింసలను భరించలేక సదరు మహిళ నాలుగు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బరేలికి చెందిన 19ఏళ్ల యువకుడు హైదరాబాద్‌ జవహార్‌నగర్‌లోని ఓ ఇంట్లో వంట పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఫేస్‌బుక్‌ ద్వారా వివాహితకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని.. పిల్లలకు తండ్రిగా ఉంటానని నమ్మబలికాడు. ఇటీవలె సదరు వివాహితకు స్థానికంగా ఓ ఇంట్లో వంటపనులు చేసే అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో సదరు యువకుడు, ఆ వివాహితను కలిసేందుకు తరచూ ఆ ఇంటికి వెళ్తుండగా స్థానికులు గమనించారు. ఇదే విషయమై యువకుడిని నిలదీయగా ఆమెను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపి అక్కడి నుంచి జారుకున్నాడు. అనంతరం ఎవరికీ కనిపించకుండా పోయాడు. వివాహితకు సైతం యువకుడు స్పందించడం లేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.