లంచం ఇవ్వలేను.. బదులుగా ఈ బర్రెను తీసుకోండి

పూర్వీకుల ఆస్తిని మ్యూటేషన్‌ చేయాలని ఓ మహిళ సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించింది. అందుకు వారు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో చేసేదేమీలేక అప్పు చేసి మరీ లంచాన్ని ఇచ్చింది. అయినప్పటికీ పనిచేయకుండా సదరు అధికారి మరింత లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో అంత మొత్తం ఇచ్చుకోలేనని, కావాలంటే తన ఇంట్లోని బర్రెను తీసుకోవాలని కోరడమేగాక, ఏకంగా ఆ బర్రెను తీసుకొచ్చి రెవెన్యూ కార్యాలయంలో కట్టేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. అధికారికి తగిన బుద్ధి చెప్పింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సిద్‌ జిల్లాలో తీవ్ర చర్చనీయాశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సిధ్‌ జిల్లాలోని నౌధియాకు చెందిన రాంకిలా పటేల్‌ అనే మహిళకు పూర్వీకుల నుంచి కొంత ఆస్తి సంక్రమించింది. దానిని తన పేరు మీదకు మ్యూటేషన్‌ చేయాలని తాసిల్దార్‌, రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకున్నది. రోజులు గడుస్తున్నా ఆ పని మాత్రం పూర్తికావడం లేదు. దీంతో రాంకిలా నేరుగా సంబంధిత రెవెన్యూ అధికారిని కలిసి ఆరా తీసింది.

 

 

అయితే రూ.10వేలు లంచమివ్వనిదే పనికాదని వారు తేల్చేశారు. దీంతో అప్పు చేసి అధికారులకు వారు అడిగిన మొత్తాన్ని రాంకలి అందజేసింది. అయినప్పటికీ ఆ పని పూర్తికాలేదు. ఇదే విషయమై మరోసారి అధికారులను ఆమె సంప్రదించగా మరో రూ.10వేల లంచాన్ని వారు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే అంత మొత్తం తన వద్ద లేదని, కావాలంటే తమ ఇంట్లోని గెదెను తీసుకుని ఆ పని చేయాలని సదరు మహిళ సంబంధిత అధికారులను కోరింది. అంతటితో ఆగకుండా బర్రెను తీసుకుని ఏంగా తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్లింది. అక్కడే ఒక ఫిల్లర్‌కు కట్టేసింది. ఇప్పుడు ఇదే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారుల లంచగొండి తనాన్ని మరోసారి బయటపెట్టింది. ఇదిలా ఉండగా.. సదరు మహిళకు సంబంధించిన పని 4రోజుల క్రితమే పూర్తయిందని, కావాలనే తమను బద్నాం చేస్తున్నదని రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. అదీగాక సదరు మహిళ రాంకిల పటేల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

Tags: barbary, madyapradesh, sidh