తెలంగాణ షార్ట్ ఫిల్మ్‌కు అంత‌ర్జాతీయ అవార్డు..

సోష‌ల్ మీడియాకు బానిస‌లుగా మారి ఎంతో మంది జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. కోరి స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నారు. కుటుంబాల‌ను విచ్చిన్నం చేస్తున్నాయి. అనే మాట‌లు విప‌రీతం ప్ర‌చారంలో ఉన్నాయి. కానీ అదే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు త‌మ సృజ‌నాత్మ‌క‌త‌ను ప‌దును పెట్టుకుంటున్నారు. నైపుణ్యాల‌ను ప్ర‌దర్శించి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను పొందుతున్నారు. మార్గ‌ద‌ర్శ‌కులుగా నిలుస్తున్నారు. అందులో హైద‌రాబాద్‌కు చెందిన స‌త్య‌వోలు, అషుల్ కూడా చోటు ఉంటుంది. వారిద్ద‌రూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం మొద‌టి నుంచీ ఉద్య‌మిస్తున్నారు. ప్ర‌ధానం గోల్కొండ వెనుక‌నున్న ఇబ్ర‌హీం చెరువును సంర‌క్షించాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా చెరువు ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ఏర్పాటు చేసి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారు తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు అంత‌ర్జాతీయ స్థాయిలో అవార్డును అందుకోవ‌డమేగాక ప్ర‌శంస‌ల‌ను పొందుతున్న‌ది. ఒక్క‌సారిగా వారి పేరు మార్మోగిపోతున్న‌ది.

మనుషులు తమ జీవనానికి ఉపయోగపడే చెరువులు, పర్యావరణం, వాతావరణ సమతుల్యతలను ఏవిధంగా దెబ్బ తీస్తున్నారనే ఇతి వృత్తాంతంతో ప్రజలందరి గుండెలకు హత్తుకునేలా చెరువుల ప‌రిరక్ష‌ణ క‌మిటీ స‌భ్యుడు సునీల్‌ సత్యవోలు ద‌ర్శ‌కుడు అన్షుల్ నేతృత్వంలో ఓ షార్ట్ ఫిలింను నిర్మించాడు. మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్‌ పెద్ద చెరువు వద్ద నిర్మించిన ఆ ల‌ఘు చిత్రం పేరు సైలెంట్ వాయిస్‌. దాని నిడివి కేవ‌లం రెండున్నర నిమిషాలు మాత్ర‌మే కావ‌డం విశేషం. దాని విష‌యానికి వ‌స్తే ఓ చెరువు తాను పొందుత‌న్న‌ కష్టాలను, ఆవేద‌న‌ను పదేళ్ల మూగ బాలికకు చెప్పుకోగా, ఆ బాలిక చెరువును ఊరడిస్తుంది. ఆ స‌న్నివేశాలు చాలా హృద్యంగా చిత్రీక‌రించారు. ఆ షార్ట్ ఫిలిం ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో ఎన్విరాన్‌మెంట‌ల్‌, క్లైమేట్ చేంజ్‌, అట‌వీశాఖల అవార్డుల‌ను అందుకున్న‌ది.

తాజాగా లంప ఇంట‌ర్నేష‌నల్ పుర‌స్కారాన్ని సైతం ద‌క్కించుకుంది. అమెరికా రాజ‌ధాని న్యూయార్క్ నిర్వహించిన 75వ లంప ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌లో చైర్‌పర్సన్‌ ఓల్గా జుబ్కొవా, యునైటెడ్‌ నేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, సోషల్‌ అఫైర్స్‌ సెక్రటరీ జనరల్‌ లియూ జెన్‌మిన్, రష్యా మొదటి డిప్యూటీ శాశ్వత ప్రతినిధి డ్మిట్రై పోల్యానస్కై నుంచి సునీల్ స‌త్య‌వోలు అవార్డును అందుకున్నారు. కమిషన్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ఏటా ఇలాంటి షార్ట్‌ఫిల్మ్‌ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తుంది. పోటీల‌కు నామినేట్ అయిన సైలంట్ వాయిస్ ఏకంగా 17 పాయింట్లు సాధించి ప్రథమ బహుమతి దక్కించుకోవడం విశేషం. అంతే కాదు గతేడాది జాతీయ షార్ట్‌ఫిల్మ్‌ విభాగంలో కూడా ఈ ల‌ఘుచిత్రం మొదటి స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. చెరువుల ప‌రిర‌క్ష‌ణకు స‌త్య‌వోలు చేస్తున్న కృషిని ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు అభినందిస్తున్నారు.

Tags: director anshul, ibhrhim cheruvu, silent voice, sunil styavolu