సాంకేతిక విప్లవంలో ఒకవైపు దేశాలు ముందుకు దూసుకుపోతుంటే ఇంకా కొందరు సనాతన సంప్రదాయాలు, ఆచారాల పేరిట ఆరాచాకాలకు పాల్పడుతున్నారు. కన్నబిడ్డలని కూడా చూడకుండా కర్కషంగా హతమారుస్తున్నారు. మూఢవిశ్వాసాల పేరిట మృగాళ్లుగా మారుతున్నారు. అలాంటి ఘటనల్లో పరువు హత్యలు కూడా ఒకటి. కాప్ పంచాయతీలు.. హనర్ కిల్లింగ్ కేసులు దక్షిణాదికన్నా ఉత్తరాది భారత్‌లో కాస్తా ఎక్కువగానే జరుగుతుంటాయి. అందులో ముఖ్యంగా రాజస్థాన్, చండిఘడ్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో మరీ ఎక్కువ. గత కొంత కాలంగా ఇలాంటి ఘటనలు తగ్గుముఖం పట్టినా తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటన వెలుగు చూసింది. ఒకే గోత్రం వాడిని పెళ్లి చేసుకుందని కన్న కూతురని కూడా చూడకుండా కుటుంబసభ్యులే దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
తూర్పు ఢిల్లీకి చెందిన రెండు కుటుంబాలు పాల వ్యాపారం నిర్వహిస్తూ పక్కపక్కనే నివాసముంటున్నారు. వారి రెండు కుటుంబాలు కూడా ఒకే గోత్రానికి చెందినవి. ఇదిలా ఉండగా వారిలో ఓ కుటుంబానికి చెందిన యువతి, మరో కుటుంబానికి యువకుడు మధ్య ప్రేమ చిగురించింది. 2016 నుంచి మూడేళ్ల పాటు వారు గుట్టుగా సహజీవనం కూడా చేశారు. ఈ క్రమంలో 2019 అక్టోబర్‌లో ఆ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసింది. ఈ నేపథ్యంలో వారు వెంటనే పెళ్లి చేసుకున్నారు. అవకాశం చూసి పెద్దలకు మరోసారి విషయాన్ని చెప్పి నచ్చజెబుదామనే ధీమాతో పెళ్లి చేసుకున్నా ఎవరి ఇంట్లో వారు ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 20న తన పెళ్లి విషయాన్ని సదరు యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీనిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పక్కా ప్లాన్ ప్రకారం.. 29వ తేదీన కన్న కూతురని కూడా చూడకుండా కుటుంబ సభ్యులే ఆమె గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత యువతి మృతదేహాన్ని కారులో తూర్పు ఢిల్లీ నుంచి దాదాపు 80 కిలో మీటర్ల దూరంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సికింద్రాబాద్ వద్దకు తీసుకెళ్లి అక్కడి అలీగఢ్ కాలువలో పడేసి చేతులు దులుపుకున్నారు.
ఇదంతా తెలియని అంకిత్.. కొన్ని రోజుల నుంచి భార్య కనిపించకపోవంతో ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 18న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అత్తమామలపై అనుమానం వ్యక్తం చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. అయితే అప్పటికే జనవరి 30న యూపీ పోలీసులు కాలువలో తాము గుర్తించిన గుర్తు తెలియని యువతి మృతదేహాం సమాచారం వారికి అందడంతో అది అదృశ్యమైన యువతిదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు యూపీకి వెళ్లి ఆ మృతదేహం పరిశీలించి అది సదరు యువతిదేనని నిర్ధారణకు వచ్చారు. అనంతరం యువతి తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. దీంతో వారు అసలు నిజాన్ని ఒప్పుకోవడంతో వారు కంగుతిన్నారు. అనంతరం హత్య కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు.