టీడీపీలో అన్న క్యాంటీన్ల చిచ్చు.. రంగంలోకి చంద్రబాబు..

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ దృష్టి అంతా అన్న క్యాంటీన్ల మీదే పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల అన్న క్యాంటీన్లను పార్టీ నేతలు ప్రారంభించారు. తక్కువ ధరకే భోజనం వస్తుంది కాబట్టి.. ప్రజలు కూడా క్యాంటీన్ల వైపు వస్తున్నారు. ఇదే అదనుగా భావించిన తెలుగుదేశం పార్టీ దీన్ని రాజకీయం చేయాలని భావిస్తోంది. మరోవైపు అధికార పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం వారికి అడ్డంకులు కల్పించడం కలిసివచ్చింది. దీంతో ఈజీగా తెలుగుదేశం వాళ్లకు పబ్లిసిటీ వచ్చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు ఈ అన్న క్యాంటీన్ల ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో గ్రూపులుగా ఏర్పడి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇది తెలుగుదేశం హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. అన్న క్యాంటీన్ల అంశాన్ని రాజకీయం చేద్దామనుకుంటే పార్టీలో అంతర్గత సమస్యలు మొదలు కావడం చంద్రబాబుకు తలనొప్పిగా మారిందట. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసుకున్నారు.

ఓ వైపు మల్లి వర్గీయులు, వైవీ ఆంజనేయులు వర్గీయులు వేర్వేరుగా అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. కార్యకర్తలు కూడా ఇరువర్గాలుగా విడిపోయి.. తమ బలం చూపించుకుంటున్నారు. ఇంకా అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు సమాచారం. బలం, బలగం చూపించేందుకు అధినేత వద్ద మార్కులు కొట్టేసేందుకు ఇదే మంచి అవకాశమని నేతలు పోటాపోటీగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారట.

ఈ విషయం అధినేత చంద్రబాబు చెవిలో పడింది. దీంతో ఆయన నేరుగా రంగంలోకి దిగారట. నేతలెవరూ వ్యక్తిగతంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయొద్దని.. పార్టీ పరంగా మాత్రమే ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి అన్న క్యాంటీన్ల వ్యవహారం టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ తెచ్చినట్టుంది.

Tags: andhra politics, anna censante, chandra babu naidu, political news