చంద్రబాబు గురువులు వాళ్లే.. హీట్ పెంచిన బొత్స కామెంట్లు..

ఏపీ రాజకీయాలు ఈ మధ్య నిత్యం హాట్ హాట్ గానే ఉంటున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలు, అధికార పక్షం కౌంటర్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇదిలా ఉంటే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కూడా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాష్ట్రంలోని పలు ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ఘనంగా నిర్వహించింది. పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను సీఎం జగన్ సత్కరించారు కూడా.. ఇదిలా ఉంటే ప్రతిపక్ష టీడీపీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తోంది.

రాష్ట్రంలోని గురువులను ముఖ్యమంత్రి అవమానించారని.. వారి డిమాండ్లు నెరవేర్చలేదని ఉపాధ్యాయ దినోత్సవానికి కొద్ది రోజుల ముందుకు పలువురు టీచర్లను జైళ్లో పెట్టించారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నాయుడు ఎనాడైనా ఉపాధ్యాయులను పట్టించుకున్నారా? విద్యారంగాన్ని పట్టించుకున్నారా? ఆయన హయాంలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఏమిటో ప్రజలందరికీ తెలుసు. కార్పొరేట్ కోసం ప్రభుత్వ విద్యను నాశనం చేశారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ విద్యావ్యవస్థను బాగు చేస్తున్నారు. నాడు – నేడు కార్యక్రమం కింద ఎన్నో స్కూళ్లను బాగుపరిచారు. ప్రస్తుతం ఇంకా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఉపాధ్యాయులకు వైసీపీ హయాంలో గౌరవం పెరిగింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించారు. దీన్ని ఓర్చుకోలేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

అసలు చంద్రబాబుకు గురువులు అంటే అర్థం తెలుసా. ఆయనకు వెన్నుపోటుకు బాగా సహకరించిన రామోజీరావు, రాధాకృష్ణ ఆయనకు గుర్తుకు వస్తారేమో.. వాళ్లనే గౌరవించుకుంటారేమో’ అంటూ మంత్రి బొత్స వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గురు దేవోభవ అంటూ ప్రతీ ఏటా గురువులని సత్కరించుకునే సంప్రదాయం మనకు ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా చంద్రబాబు రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువును అవహేలన చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మానవత్వం లేదు.. విలువలు లేవని విమర్శించారు.

Tags: ap ex cm chandrababu, ap politics, Botsa Satyanarayana, chandra babu naidu, minister botsa, political news