సాగదీత కథనంతో సరిలేరు నీకెవ్వరూ..

భారీ అంచనాలతో మహేష్‌బాబు హిరోగా సంక్రాంతి బరిలోకి దూసుకొచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా సాగదీత కథనంతో ముందుకు సాగడం ప్రేక్షకులను, అటు ప్రిన్స్‌ అభిమానులను నిరాశకు గురిచేసింది. అంచనాలను తలకిందులు చేసింది. అనిల్‌రావిపూడి తెరికెక్కించిన ఈ చిత్రం బాక్సాఫిస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇందులో కథ విషయానికి వస్తే అనాథ అయిన అజయ్‌(మహేష్‌) సైన్యంలో సీనియర్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు. ధైర్యసాహసాలకు మారుపేరుగా నిలుస్తుంటాడు. తన సహచర జవాన్‌ (సత్యదేవ్‌) గాయపడడంతో అతని బాధ్యతలను నెరవేర్చడానికి కర్నూలుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లగానే సదరు జవాను తల్లి, ప్రొఫెసర్‌ భారతి (విజయశాంతి) ఒక సమస్యలు చిక్కుకుందని తెలుసుకుంటాడు. మంత్రి నాగేంద్రతో (ప్రకాష్‌రాజ్‌) ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

అజయ్‌ సహచర జవాను సత్యదేవ్‌కు ఉన్న బాధ్యతలు ఏమిటీ? ప్రొఫెసర్‌ భారతి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటీ? మంత్రి నాగేంద్రకు వారి విరోధం ఎలా ఏర్పడింది? వారికి మహేష్‌ ఎలా అండగా నిలబడ్డాడు? చివరికి ఏమైంది? మంత్రి నాగేంద్రకు జవాన్‌ మహేష్‌ ఎలాంటి గుణపాఠం నేర్పాడు? అన్నది కథాంశం. అయితే ఫస్టాఫ్‌లో యాక్షన్‌ సీన్‌లు, దేశభక్తి ఎమోషనల్‌ సన్నివేశాలతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ప్రేక్షకుల్లో ఉత్సకతను నింపుతుంది. కొండారెడ్డి బురుజువద్ద తీసిన యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకే హైలట్‌గా నిలుస్తాయి. ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే సాగదీత ధోరణితో నడవడం ప్రేక్షకులకు రుచించడం లేదు. మహేష్‌ ఉపన్యాసాలు ఇవ్వడం బోర్‌ తెప్పిస్తుంది. కథను బిగువుగా నడపడంలో దర్శకుడు పూర్తిగా పట్టుతప్పినట్లుగా కనిపిస్తుంది.

ఇక సినిమాలో చాలా కాలం విరామం తర్వాత నటించిన విజయశాంతి హిరో మహేష్‌, విలన్‌ ప్రకాష్‌రాజ్‌తో పోటాపోటీగా నటించి మెప్పించారు. ఆమె చెప్పిన ” మీ ఇంట్లో ఒక మగాడు ఉండాలి” అనే పంచ్‌ డైలాగ్‌కు థియేటర్లలో చప్పట్లు పడుతున్నాయి. హిరోయిన్‌ రష్మిక మందన్న అందాల ఆరబోత కొత్తగా ఉంది. అందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ తమదైన శైలీలో నటించి మెప్పించారు. దేవిశ్రీ అందించిన సంగీతం వీనుల విందుగా ఉంది. మొత్తంగా సినిమా ఫర్యాలేదనిపించినా ఆశించిన అంచనాలకు చేరుకోలేకపోయిందని చెప్పవచ్చు.

Tags: MaheshBabu, review, Sarileru Neekevvaru, Tollywood