అమరావతి ఆడపడుచులకు సినీనటుడు, ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పృథ్వీ క్షమాపణలను చెప్పి తీరాల్సిందేనని నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి డిమాండ్ చేశారు. సీఎం జగన్‌ను అన్‌పాపులర్ చేయడానికే పృథ్వీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల రాజధాని కోసం ధర్నా చేస్తున్న రైతులు, మహిళలపై నటుడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రైతులను పెయిడ్ అర్టిస్టులుగా వర్ణించడమేగాక, చొక్కాలు ప్యాంట్లు వేసుకొని ధర్నాలు చేస్తున్నారని, వారికి కార్లు ఉన్నాయంటూ ఇష్టారీతిన మాట్లాడారు. అదేవిధంగా ధర్నాలో పాల్గొన్న మహిళలు బంగారు గాజులు ధరించారంటూ వ్యాఖ్యానించారు. పృథ్వీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో పృథ్వీపై సహచర నటుడు పోసాని కృష్ణమురళి నిప్పులు చెరిగారు. పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రైతులు చొక్కాలు, ప్యాంట్లు వేసుకోకూడదా? కార్లలో తిరగకూడదా. వ్యవసాయం చేసే మహిళలు బంగారు గాజులు వేసుకోకూడదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులను ఎవరు అవహేళన చేసినా తాను సహించబోనని నటుడు పృథ్వీ క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. అలాంటి నాయకుల వల్లే జగన్ ప్రతిష్ట దెబ్బతింటున్నదని వాపోయాడు. ఇప్పటికైనా మహిళలకు, రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులకు అన్నివిధలా అండగా ఉంటారని, ఎవరికీ అన్యాయం చేయబోయడని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.