తప్పు బాబుదే..! కుప్పం ఘటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈ ఉదయం జరిగిన ఘటన రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. చంద్రబాబు పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం.. అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కాగా ఈ ఘటనపై తెలుగుదేశం, వైసీపీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఘటనపై స్పందించారు.

కుప్పం ఘటనలో తప్పంతా చంద్రబాబుదేనని పేర్కొన్నారు. ఆయనే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని ఆరోపించారు. కుప్పం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అక్కడికి వెళ్లి విద్వేష రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కుప్పం ప్రజలు టీడీపీని తిరస్కరించారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమైందని .. ఉనికిని చాటుకొనేందుకే ఆయన ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

డిప్రెషన్‌లో చంద్రబాబు

‘చంద్రబాబు నాయుడు డిప్రెషన్ లో ఉన్నారు. కుప్పంలో టీడీపీ పని అయిపోయింది. అందుకే ఏం చేయాలో అర్థంకాక అరాచకం సృష్టిస్తున్నారు. నిన్న ఇవాళ జరిగిన ఘటనల్లో చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలదే తప్పు. కుప్పం సెగ్మెంట్‌లో వైసీపీ జెండాలు పెట్టారని మా కార్యకర్తలను టీడీపీ వాళ్లు కొట్టారు. ఇవాళ శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే మళ్లీ అరాచకం సృష్టించారు. అక్కడ వైసీపీ బలంగా ఉంది. అందుకే చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

జనాన్ని చంద్రబాబే స్వయంగా రెచ్చగొట్టారు. దాడులకు ఉసిగొల్పారు. 30 ఏళ్లుగా దొంగ ఓట్లతో గెలుస్తూ వచ్చారు. వాటన్నిటికీ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ దెబ్బతో బ్రేక్ పడింది. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి ఆ నియోజకవర్గాన్ని వైఎస్సార్‌సీపీ బయటకు తెచ్చింది. స్థానిక ఎన్నికలలో మేము అన్నిటిలోనూ గెలిచాం. చంద్రబాబు వైఖరితో విసుగు చెందిన కుప్పం ప్రజలు ఆయనకు చెల్లుచీటి చెప్పారు. టీడీపీ జెండాలు కట్టుకోవచ్చు. కానీ వైసీపీ జెండాలు పీకటం ఎందుకు?’’ అని సజ్జల ప్రశ్నించారు.

అన్నా క్యాంటీన్ పేరుతో రచ్చ చేశారు. గంటకుపైగా రోడ్డుపైన కూర్చున్నారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో వదిలేశారు. అందుకే కావాలని అక్కడకు వెళ్లి కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఎన్ని ఆరోపణలు చేసినా జనం నమ్మటం లేదు. అప్పట్లో వైఎస్సార్‌, 2019కి ముందు జగన్ పాదయాత్ర చేసి చంద్రబాబు చేసిన తప్పులు ప్రజలకి వివరిస్తే జనం నమ్మారు. అలాగే చేయాలని ఇప్పుడు చంద్రబాబు అనుకున్నాడు.‌ కానీ వాస్తవాలను చెప్తేనే నమ్ముతారన్న విషయాన్ని మాత్రం మర్చిపోయారు’ అని సజ్జల పేర్కొన్నారు.

Tags: sajala ramakrishna reddy, tdp chandrababu naidu, tdp political news, ysrcp