కోబ్రా తెలుగు ట్రైలర్.. వచ్చినట్టా.. రానట్టా..?

వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ కమల్ హాసన్ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చియాన్ విక్రమ్. విక్రమ్ కమల్ హాసన్ లాగే హిట్ ఫ్లాప్ లకు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇదివరకు అపరిచితుడు సినిమాలో మూడు గెటప్ లలో కనిపించి ఆకట్టుకున్నాడు విక్రమ్. ఇప్పుడు తాజాగా చేస్తున్న కోబ్రా సినిమాలో ఏకంగా ఐదు గెటప్ లు పోషిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా తమిళ ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విక్రమ్ ఈ సినిమాలో గణిత శాస్త్రవేత్తగా నటిస్తున్నాడు. కాగా సినిమా తెలుగు ట్రైలర్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. కోబ్రా సినిమాకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తుండగా.. సెవెన్ స్టూడియోస్, రెడ్ జెయింట్ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మించాయి. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ గా నటిస్తూ సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. కాగా కోబ్రా సినిమా ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడగా.. ఆగస్టు 31వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల కానుంది. అపరిచితుడు తర్వాత సరైన హిట్ లేని విక్రమ్ కి ఈ సినిమా అయినా విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

Tags: kobra movie, telugu trailers, tollywood gossips, tollywood news, vikram