చంద్రబాబు కుప్పం పర్యటన రణరంగంగా మారింది. రెండో రోజు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రెండో రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. బుధవారం కొల్లుపల్లిలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ తలెల్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు వైసీపీ కుప్పం బంద్ కు పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.ఫ్లెక్సీలను చింపేశారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద టేబుళ్లు ధ్వంసం చేశారు. మరోవైపు చంద్రబాబు పర్యటనకు కౌంటర్‌గా వైసీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్ తమ ఇళ్ల నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకూ నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. అన్న క్యాంటీన్ వద్ద ఉన్న టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పర దాడులకు పాల్పడ్డారు. వైసీపీ, టీడీపీ నేతలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో చిత్తూరు ఎస్పీ కూడా కుప్పంకు చేరుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద, కట్టుదిట్టమైన బలగాలతో పోలీసులు మోహరించారు. చిత్తూరు జిల్లా నుంచే కాక తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాల నుంచి అదనపు పోలీస్ బలగాలు కుప్పంకు చేరుకున్నాయి. కుప్పంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. కుప్పంలో పరిస్థితులకు నిరసనగా చంద్రబాబు నాయుడు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలిపారు.