దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం అంటే రికార్డులకు మారుపేరుగా నిలిచిపోతున్నది. ఆయన సినిమా షూటింగ్ ప్రారంభమైంది మొదలు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చేంత వరకూ, ఆపైన రికార్డుల మీదా రికార్డులే సృష్టిస్తుంటాయి. పాత రికార్డులను బ్రేక్ చేస్తుంటాయి. ఇది పరిపాటిగా మారిపోయింది. బాహుబలి తర్వాత కుమ్రం భీం, అల్లూరి సీతారామరాజుల కథలతో సోషల్ ఫాంటసీ కథాంశంతో అగ్రనటులు ఎన్టీఆర్, రామ్‌చరణ్తో ఎస్ఎస్ రాజమౌళి ప్యాన్ ఇండియా లెవల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా ఇప్పటికే 70 శాతం వరకు చిత్ర నిర్మాణం పూర్తయింది. బాలివుడ్ నటుడు అజయ్‌దేవగణ్ కీలక పాత్రను పోషించనుండగా ఆ సన్నివేశాల చిత్రీకరణ సైతం పూర్తయింది. విశాఖ మన్యంలో చిత్రం పతాక సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉంది. మొదటగా జూన్ 30న చిత్రాన్ని విడుదల చేయాలని భావించినా దానిని వాయిదా వేశారు. ఇటీవలే సరికొత్త తేదీని ప్రకటించారు. 2021 జనవరి 8వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తామని కొత్త పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. అదీగాక రామ్ రౌద్ర రుషితం అనే టైటీల్‌ను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా.. విడుదలకు ముందే ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డులను తిరగరాస్తున్నది. సంచలనాలను సృష్టిస్తున్నది. చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్‌ను కోట్లలో చేసిందని టాలివుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ర్టాల్లో మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిసి ఈ సినిమా ఇప్పటి వరకు రూ.200 గ్రాస్‌ను షేర్ చేసినట్లు ప్రాథమిక సమాచారం. నెల్లూరు తప్ప అన్ని ఏరియాల్లో ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ ముగిసినట్లు తెలుస్తున్నది. నైజాం ఏరియాకు సంబంధించి ప్రీరిలీజ్ హక్కులను వెంకటేశ్వర క్రియేషన్ అధినేత దిల్ రాజు దక్కించుకున్నారని సమాచారం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తెలుగు వెర్షన్స్‌కు సంబంధించి రూ.300 కోట్ల బిజినెస్ జరిగినట్లు టాలివుడ్ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇప్పడే ఇలా ఉంటే మున్ముందు మరెన్ని రికార్డులను నెలకొల్పుతుందోనని అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.